విజయనగరానికి చెందిన గాదె వెంకట నారాయణ (40), విజయవాడకు చెందిన ఎం.రాజు (40)లు గవర్నర్‌పేటలో రాము అనే మేస్త్రి వద్ద క్యాటరింగ్ పనులకు వెళుతుంటారు. డీటీ రావు వీధిలోని ఒక భవనంలో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. కొత్తపేట పీఎస్ పరిధిలో ఉండే జమ్ము కిషోర్ అనే రౌడీషీటర్ కూడా క్యాటరింగ్ పనులకు వెళుతుంటాడు. అప్పుడప్పుడు వీరి గదికి వస్తుంటాడు. బుధవారం మధ్యాహ్నం ముగ్గురూ కలిసి మద్యం తాగారు. కొద్ది సేపటికి వారి గదిలో నుంచి కేకలు వినిపించాయని పక్క గదుల్లో ఉండే వారు చెబుతున్నారు. తర్వాత కిషోర్ కంగారుగా బయటకు వెళ్లిపోతుండగా చూశానని అక్కడే ఉన్న బాషా అనే వ్యక్తి చెప్పారు. ఆ గదిలోకి వెళ్లికి చూడగా రాజు, వెంకట నారాయణలు రక్తపు మడుగులో పడి ఉన్నారు. వెంటనే ఆయన గవర్నర్‌పేట పోలీసులకు తెలియజేయగా సీఐ అడపా నాగమురళి హుటాహుటిన వచ్చారు. వెంకట నారాయణ నేలపై పడి చనిపోయి ఉండగా, రాజు కూర్చునే ప్రాణాలు కోల్పోయాడు. నేరస్థలమంతా రక్తపు మడుగు కట్టి ఉంది. పదునైన ఆయుధంతో దాడిచేసి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇద్దరూ మద్యం మత్తులో ఉండడంతో గొడవ జరిగి కత్తితో దాడి చేస్తున్నా ఏం చేయలేకపోయారని ఒక నిర్ధారణకు వచ్చారు. క్లూస్ టీమ్ వేలిముద్రలు, ఇతర సాంకేతిక ఆధారాలను సేకరించింది. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తామని పోలీసులు వెల్లడించారు. నిందితుడు పారిపోయిన డీటీరావు లైనులోని సీసీ ఫుటేజీలు సేకరిస్తున్నారు. సౌత్ ఏసీపీ డి.పావన్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డీసీపీ కె.జి.వి.సరిత విచ్చేసి వివరాలు సేకరించారు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
విజయవాడలో జంట హత్యలు
July 17, 2025
0
Tags