కాల్పుల విరమణకు కంబోడియా పిలుపు

Telugu Lo Computer
0


కంబోడియా - థాయిలాండ్ మధ్య సరిహద్దు ప్రాంతాల్లో జరుగుతున్న ఘర్షణలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతున్నాయి. మృతుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో అంతర్జాతీయ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే కంబోడియా తక్షణ కాల్పుల విరమణకు పిలుపునిచ్చింది. తమ లక్ష్యం శాంతియుత పరిష్కారమని, వివాదాలను దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించాలనే స్పష్టం చేసింది. ఈ ఘర్షణలకు ప్రధానంగా ప్రెయా విహార్, ప్రసాత్ తా మ్యూన్ థామ్ దేవాలయాల పరిసర ప్రాంతాల్లోనే చోటు చేసుకుంటున్నాయి. ఇరు దేశాలు పరస్పరం రాకెట్లు, ఫిరంగి దాడులు చేసుకోవడంతో సరిహద్దు ప్రాంతాలు యుద్ధభూమిగా మారాయి. 11వ శతాబ్దంలో నిర్మించబడిన ప్రెయా విహార్ హిందూ దేవాలయం చారిత్రకంగా, భౌగోళికంగా ప్రాముఖ్యం కలిగినది. 1962లో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ దేవాలయంపై కంబోడియా సార్వభౌమత్వాన్ని ధృవీకరించినప్పటికీ, సరిహద్దు రేఖల స్పష్టత లేకపోవడం వల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఘర్షణలపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించింది. థాయిలాండ్, కంబోడియా అనవసరమైన దాడులు చేస్తున్నట్లు ఒకరినొకరు ఆరోపించుకున్నాయి. థాయిలాండ్ రాయబారి కంబోడియా నిర్దాక్షిణ్యంగా దాడులు చేస్తోందని ఆరోపించగా, కంబోడియా రాయబారి దీనిని ఖండిస్తూ తాము "అత్యధిక సంయమనం పాటిస్తున్నాం" అని స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)