ఢిల్లీలో కుల గణనపై సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ మోడల్ అంటే ఏమిటో తెలిపేందుకే ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నట్లు తెలిపారు. భారత్ జోడో యాత్రలో కుల గణనపై రాహుల్ గాంధీ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణలో అధికారంలోకి రాగానే కుల గణన సర్వే చేశామన్నారు. దేశానికి ఒక దశ దిశను చూపించేలా ఈ కుల గణన సర్వే చేపట్టామని ఆయన వివరించారు. దాదాపు వందేళ్ల తర్వాత కుల గణన ప్రక్రియ నిర్వహించామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒత్తిడితోనే దేశవ్యాప్త కుల గణనకు కేంద్రం దిగి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయడమే ఎజెండాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. అందులోభాగంగా బీసీ కులగణన, బీసీ రిజర్వేషన్ బిల్లు అంశాలపై కాంగ్రెస్ ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తున్నారు. న్యూఢిల్లీలోకి కొత్త ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉభయ సభల సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే వివరాలను ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి వివరిస్తున్నారు. అయితే ఈ 42 శాతం రిజర్వేషన్లకు మోడీ ప్రభుత్వం ఆమోదం తెలిపే విధంగా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అలాగే ఈ పార్లమెంట్ సమావేశాలలో 42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలిపేలా ఉభయ సభల్లో కాంగ్రెస్ ఎంపీలు ఒత్తిడి చేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ అగ్రనేతలతోపాటు కాంగ్రెస్ ఎంపీలంతా దాదాపుగా హాజరయ్యారు. ఇక ఈ రోజు ఉదయం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఈ కుల గణనసర్వే వివరాలను సీఎం రేవంత్ రెడ్డి సోదాహరణగా వివరించిన సంగతి తెలిసిందే.
ఢిల్లీలో కుల గణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి
July 24, 2025
0
Tags