హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో సామాజిక న్యాయం సమరభేరి జరిగింది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలు కష్టపడి పని చేశారని, కార్యకర్తల కృషి వల్లే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చిందని కొనియాడారు. ఇక, కేసీఆర్, బీజేపీ.. తెలంగాణలో కాంగ్రెస్ ను అడ్డుకున్నారు.. హైదరాబాద్ లో ఉన్న పెద్ద పరిశ్రమలను.. నరేంద్ర మోడీ తీసుకు రాలేదని సెటైర్లు వేశారు. హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద కంపెనీలు అన్నీ కాంగ్రెస్ హయాంలోనే వచ్చాయని మల్లికార్జున ఖర్గే గుర్తు చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం, సన్న బియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లను ఇచ్చిందని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క సహా అందరూ కలిసికట్టుగా పని చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.. తెలంగాణలో కులగణన.. దేశానికే రోల్ మోడల్ అని తెలిపారు. బీసీ రిజర్వేషన్లు అమలయ్యే వరకు పోరాడుతూనే ఉంటామని ఆయన తేల్చి చెప్పారు. ప్రధాని మోడీ చెప్పేవి అన్నీ అబద్దాలే అని ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఆరోపించారు. గత 11 సంవత్సరాలలో నరేంద్ర మోడీ తెలంగాణకు ఏం ఇచ్చారని ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు 15 లక్షల రూపాయలతో పాటు ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోడీ హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాడు.. ఆ తర్వాత హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఏం చెబుతుందో అది చేసి చూపిస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను.. బీజేపీ నాశనం చేసిందని మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడిని కాంగ్రెస్ పార్టీ ఖండించింది అని ఖర్గే తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని సమర్థించింది.. కానీ, బీహార్ ఎన్నికల ప్రచారంపై ఉన్న శ్రద్ధ.. నరేంద్ర మోడీకి దేశ భద్రతపై లేదని విమర్శలు గుప్పించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై అన్ని దేశాలు తిరిగి.. కాంగ్రెస్ నేతలు ప్రచారం చేశారు అని పేర్కొన్నారు. పాక్‌ను అంతం చేస్తామని గొప్పలు చెప్పిన బీజేపీ నేతలు.. యుద్ధాన్ని ఎందుకు ఆపారు? అని ప్రశ్నించారు. ఇందిరాగాంధీ పాకిస్థాన్‌ను రెండు ముక్కలు చేశారు.. మరి, మోడీ ఏం చేశారు..? దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉంది.. గాంధీ కుటుంబంలో దేశం కోసం ప్రాణాలు ఇచ్చినవాళ్లు ఉన్నారు.. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లో అలాంటి వాళ్లు ఉన్నారా..? 42 దేశాల్లో పర్యటించిన మోడీ.. మణిపూర్‌కి ఎందుకు వెళ్లడం లేదు? అని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అడిగారు.
కార్యకర్తల కృషి వల్లే తెలంగాణలో పార్టీ అధికారంలోకి వచ్చింది : మల్లికార్జున ఖర్గే
July 04, 2025
0
Tags