చైనాలో ఈ ఏడాది జనవరి 1 నుంచి పుట్టిన ఒక్కో బిడ్డకు ఏడాదికి రూ.42 వేలు ఇవ్వాలని, చిన్నారికి మూడేళ్లు వచ్చేవరకు దీన్ని కొనసాగించే ప్రణాళికలు సిద్ధం చేసినట్లు సమాచారం. అయితే, చైనాలోని హోహోట్, టియాన్మెన్ వంటి నగరాల్లో ముగ్గురు, అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు రూ.లక్షల నగదు, ఇతర ప్రోత్సాహకాలు అందించే పథకాలు ఇప్పటికే అమలవుతున్నాయి. ఒకే బిడ్డ విధానాన్ని అనేక దశాబ్దాల పాటు అమలు చేసిన చైనా, 2016 జనవరి 1తో దానికి స్వస్తి పలికింది. అయినప్పటికీ పిల్లల్ని కనేందుకు చైనీయులు ముందుకు రావడం లేదట. దీంతో అక్కడ సంతానోత్పత్తి రేటు గణనీయంగా తగ్గుతోంది. వివాహాల రేట్లు కూడా రికార్డు స్థాయిలో పడిపోవడంతో రానున్న రోజుల్లోనూ జనాభా సంఖ్య పెరగడం కష్టంగానే కనిపిస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకున్న చైనా ప్రభుత్వం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు అనేక చర్యలు చేపడుతోంది. సంతానోత్పత్తిపై దృష్టిపెట్టిన చైనాలోని పలు స్థానిక ప్రభుత్వాలు దంపతులకు నగదు, గృహ వసతి వంటి అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. ఇన్నర్ మంగోలియాలోని హోహోట్ నగరం తొలి సంతానానికి 10 వేల యువాన్‌ల నగదు ఇచ్చే పథకాన్ని అమలు చేస్తోంది. రెండో బిడ్డకు 50 వేల యువాన్‌లు (ఏడాదికి పదివేల చొప్పున ఐదేళ్లు), మూడో బిడ్డకు లక్ష యువాన్‌లు (ఏడాదికి పదివేల చొప్పున పదేళ్లు) నగదు అందిస్తోంది. అదనంగా మెడికల్ ఇన్సూరెన్స్, ఫ్రీ హెల్త్ చెకప్‌తోపాటు ఏడాదిపాటు ఉచితంగా ఓ కప్పు పాలు కూడా అందించే కార్యక్రమాన్ని ఈ ఏడాది మార్చి 1 నుంచి అమలు చేస్తోంది. సెంట్రల్ చైనాలోని టియాన్మెన్ కూడా ఎక్కువ మంది బిడ్డల్ని కనే దంపతులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తోంది. రెండో బిడ్డకు జన్మనిచ్చే తల్లులకు 6500 యువాన్‌లు అందించడంతోపాటు చిన్నారి మూడేళ్లు వచ్చే వరకు నెలకు 800 యువాన్‌లను ఇచ్చే కార్యక్రమాన్ని కొనసాగిస్తోంది. అదే మూడో బిడ్డ పుడితే నెలకు వెయ్యి యువాన్‌లు అందిస్తోంది. వీటితోపాటు గృహవసతి కోసం 18 వేల యువాన్‌ల సబ్సిడీ, ఉచిత హెల్త్ చెకప్‌ల వంటి అనేక ప్రయోజనాలను చేకూరుస్తోంది. ఇలా ప్రభుత్వ పథకాల ప్రభావంతో అక్కడ గతేడాదిలో జననాల రేటు 17శాతం పెరిగినట్లు అధికారిక నివేదికలు వెల్లడించాయి.
చైనాలో సంతానం ఉన్న కుటుంబాలకు ప్రోత్సాహకాలు
July 04, 2025
0
Tags