తెలంగాణలో రైతు సంక్షేమంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌కు తాము సిద్ధమని, సీఎంకే ప్రిపరేషన్‌కు టైమ్ కావాలంటే 72 గంటల సమయం ఇస్తున్నాం. ప్రిపేర్ అయి రండి, చర్చ అసెంబ్లీలో పెడతారా లేక రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డి పల్లిలో పెడతారా లేక కేసీఆర్ స్వగ్రామం చింతమడకలో మీ ఇష్టం. ప్లేస్, టైమ్, డేట్ అన్ని సీఎం ఇష్టం.. మేం ఎప్పుడైనా రెడీ? అని కేటీఆర్ సవాల్ చేశారు. శనివారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. చర్చకు సీఎం రేవంత్ రెడ్డి ఒక్కరే వచ్చినా ఓకే.. వెంట కార్యకర్తలను తెచ్చుకున్నా ఓకే అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బేసిన్‌కు, బేసిక్‌కు తేడా తెలియని వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి స్థాయికి కేసీఆర్ అవసరం లేదని.. తాము చాలు అని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో తాము ఉద్యమం నడిపితే.. రేవంత్ రెడ్డి వచ్చాక నీళ్లను ఆంధ్రాకు, నిధులను ఢిల్లీకి, నియామకాలు ఆయన సన్నిహితులకు ఇచ్చుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసినట్లు రైతులకు ఎక్కడా, ఎవరూ చేయలేదన్నారు. సీఎం సభ పెట్టారు అంటే బూతులు, ఛాలెంజులు ఉంటాయని దుయ్యబట్టారు. కేసీఆర్ స్థాయి రేవంత్ రెడ్డిది కాదు. మీకు మేము చాలు అన్నారు. బనకచర్లతో గోదావరి నీళ్లను తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆంధ్రా చర్యలకు రేవంత్ రెడ్డి వంతపాడుతున్నదంతా ప్రజలు చూస్తున్నారన్నారు. రైతులకు ఎవరు ఏం చేశారో ప్రజలకు తెలుసు. రైతు రాజ్యం ఎవరు తెచ్చారో చిన్నపిల్లాడిని అడిగినా చెప్తారు. పదేళ్లు రైతు కేంద్రంగా ప్రభుత్వం నడిపాం. కొమురం భీమ్ జిల్లాలో ఎరువుల బస్తా కోసం అనేక బాధలు పడుతున్నారు. ఎరువులు పంపిణీ చేతకాని మీరు.. కేసీఆఱ్ ను చర్చకు పిలుస్తారా అని విమర్శించారు. ఎన్నికల కోసమే రైతుభరోసా ఇచ్చారని ధ్వజమెత్తారు. అన్ని వర్గాలను మోసం చేసి ఇంకా బుకాయించాలని చూస్తే ప్రజలు నమ్మరన్నారని సీరియస్ కామెంట్స్ చేశారు.
రైతు సంక్షేమంపై రేవంత్ రెడ్డి సవాల్‌కు సిద్ధమే : కేటీఆర్
July 05, 2025
0
Tags