అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్‌ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు తిరుగు ప్రయాణానికి సిద్ధమయ్యారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమికి వచ్చేందుకు వీలుగా శుభాంశు బృందం 'డ్రాగన్' వ్యోమనౌకలోకి చేరుకొని తమ తమ స్థానాల్లో కూర్చుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.35 గంటలకు వ్యోమనౌక అంతరిక్ష కేంద్రంతో విడిపోనుంది. అనంతరం భూవాతావరణంలోకి ప్రవేశిస్తుంది. దీంతో ప్రస్తుతం అందరి దృష్టి వ్యోమనౌక అన్‌డాకింగ్ పైనే ఉంది. ఈ వ్యోమనౌక దాదాపు 21గంటల పాటు ప్రయాణించి మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు అమెరికాలోని కాలిఫోర్నియా తీరానికి చేరువలో సముద్ర జలాల్లో దిగుతుంది. అనంతరం వారిని అక్కడి నుంచి క్వారంటైన్‌కు తరలిస్తారు. దాదాపు వారం రోజుల పాటు వ్యోమగాములు ఫ్లైట్ సర్జన్ పర్యవేక్షణలో ఉంటారు. యాక్సియం-4 మిషన్‌లో భాగంగా శుభాంశు బృందం గత నెల 25న నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. 28 గంటల ప్రయాణం అనంతరం 'ఐఎస్‌ఎస్'లోకి ప్రవేశించింది. వీరి బృందం దాదాపు 18 రోజుల పాటు పలు ప్రయోగాలు చేసింది. ప్రయోగాల్లో భాగంగా వ్యోమగాముల బృందం తమ మానసిక ఆరోగ్యంపై అధ్యయనం నిర్వహించింది. ఖగోళంలోని జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. ఖగోళంలో మానవ జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుందన్న అంశంపై ఒక వీడియోను భారత విద్యార్థుల కోసం రూపొందించారు.
తిరుగు ప్రయాణానికి సిద్ధమైన శుభాంశు బృందం
July 14, 2025
0
Tags