అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లెలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బొజ్జ రాజేంద్ర బాబు అప్పుల బాధ తాళలేక ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. 'సమాజంలో గౌరవంగా బతకాలని చాలా కోరికగా ఉంది. అప్పుల వాళ్లు ప్రాణం తీసేస్తున్నారు. గంట గంటకు టెన్షన్‌. నిద్రపోయి చాలా రోజులైంది. ఆరోగ్యం బాగోలేదు. దేనికీ పనికి రాకుండా అయిపోయాను. వడ్డీలకు వడ్డీలు, అధిక వడ్డీలు కట్టలేకపోతున్నాను. అందరి దగ్గర నీచమైన మాటలు అనిపించుకుంటున్నాను. విధిలేని పరిస్థితుల్లో చచ్చిపోతున్నా' భార్య, బిడ్డ నన్ను క్షమించండంటూ రియల్టర్‌ రాజేంద్రబాబు చివరిగా సెల్‌ఫోన్‌లో సెల్ఫీ సూసైడ్‌ వీడియో తీసుకుని తనువు చాలించాడు. మదనపల్లెలో కొద్దిరోజుల క్రితం వెలుగుచూసిన కాల్‌మనీ వ్యవహారం సద్దుమణగక ముందే పట్టణానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అప్పులబాధ తాళలేక, అధిక వడ్డీలు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం కలిగించింది. పట్టణంలోని అమ్మినేనివీధికి చెందిన బొజ్జ రాజేంద్ర బాబు(55) రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇతనికి అమ్మినేనివీధి, కృష్ణానగర్‌లో రెండు సొంత ఇళ్లు ఉన్నాయి. కృష్ణానగర్‌లోని ఇంటి కింది భాగంలో రెండు వార్డు సచివాలయాలకు అద్దెకు ఇచ్చి, పై భాగంలోని ఇంటిలో రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసు నిర్వహిస్తున్నాడు. వ్యాపార లావాదేవీల్లో భాగంగా పట్టణానికి చెందిన పలువురి వద్ద అప్పులు తీసుకున్నాడు. ఇటీవల కొంతకాలంగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలవడం, వ్యాపార లావాదేవీలు పూర్తిగా స్తంభించడంతో అప్పుల వాళ్లకు చెల్లింపులు చేయలేకపోయాడు. పరువు, ప్రతిష్టలు కాపాడుకునేందుకు వడ్డీలు చెల్లించేందుకు అధిక వడ్డీకి కొత్త అప్పులు తీసుకోవడం, వాటికి వడ్డీలు చెల్లించలేక, ఇచ్చిన వారు ఇంటివద్దకు వచ్చి నిలదీస్తుంటే తట్టుకోలేకపోయాడు. బజారులో అందరి ముందు తక్కువచేసి మాట్లాడటం, తన గురించి చెడు ప్రచారం చేస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. గతంలోనూ ఆత్మహత్యకు ప్రయత్నించి, చివరి నిమిషంలో ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్నప్పటికీ, ఇటీవల అప్పుల వాళ్ల వేధింపులు అధికమయ్యాయి. బుధవారం మధ్యాహ్నం కృష్ణానగర్‌లోని కార్యాలయంలో సెల్ఫీ సూసైడ్‌ వీడియో తీసుకున్న తర్వాత రూములోని ఫ్యాన్‌ కొక్కీకి తాడు తగిలించి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులు, పోలీసులకు సమాచారం అందించారు. టూటౌన్‌ పోలీసులు ఘట నాస్థలానికి చేరుకుని, మృతుడి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బొజ్జా రాజేంద్రకు భార్య లత, ఇంటర్మీడియట్‌ చదువుతున్న కుమార్తె రిషిత ఉన్నారు.





Post a Comment

0Comments

Post a Comment (0)