ఉక్రెయిన్ నూతన ప్రధానిగా యూలియా స్విరిడెంకో

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్‌స్కీ సోమవారం యూలియా స్విరిడెంకోను దేశ తదుపరి ప్రధానమంత్రిగా నామినేట్ చేశారు. పార్లమెంట్ ఆమోదిస్తే యూలియా టిమోషింకో తర్వాత ఉక్రెయిన్ రెండో మహిళా ప్రధానమంత్రి అవుతారు. ఆమె నియామకం కేవలం ఒక లాంఛనప్రాయంగా భావించబడుతోంది. ఎందుకంటే పార్లమెంట్‌లో జెలెన్‌స్కీకి మెజారిటీ ఉంది. యూలియా స్విరిడెంకో ప్రస్తుతం ఉక్రెయిన్ ప్రభుత్వంలో మొదటి డిప్యూటీ ప్రధానమంత్రి, ఆర్థిక మంత్రిగా పని చేస్తున్నారు. యుద్ధ సమయంలో ఆమె అమెరికా, ఐరోపాతో ఆర్థిక సహకారాన్ని మాత్రమే కాకుండా.. రక్షణ పరిశ్రమ అభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషించారు. యూలియా శిక్షణ పొందిన ఆర్థిక వేత్త.. ఆమె అమెరికాలోని ట్రంప్ ప్రభుత్వంతో ఖనిజ ఒప్పందంలో కీలకంగా వ్యవహరించారు. ప్రారంభంలో అమెరికా ఉక్రెయిన్‌ను ఆర్థికంగా నియంత్రించే షరతులను విధించినప్పటికీ.. యూలియా తెలివితేటల వల్ల ఉక్రెయిన్ కు అనుకూలమైన షరతులు లభించాయి. మాజీ ఆర్థిక మంత్రి టిమోఫీ మైలోవానోవ్ ప్రకారం ఆమె ఈ చర్చకు ఏకైక, ప్రధాన నాయకురాలు. ఆమె లేకుంటే బహుశా ఒప్పందం రద్దయ్యేదన్నారు. దీనితో పాటు యూరోపియన్ దేశాలతో ఉక్రెయిన్ పునర్నిర్మాణం, యుద్ధం తర్వాత ఆర్థిక ప్రణాళికలో కూడా యూలియా నిర్ణయాత్మక పాత్ర పోషించారు. యూలియా స్విరిడెంకో డిసెంబర్ 25, 1985న ఉక్రెయిన్‌లోని చెర్నిహివ్‌లో జన్మించారు. ఆమె 2008లో కీవ్‌లోని నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ట్రేడ్ అండ్ ఎకనామిక్స్ నుండి పట్టభద్రురాలయ్యారు. అదే సంవత్సరం ఒక ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఆర్థికవేత్తగా పనిచేయడం ప్రారంభించారు. 2011లో ఆమెను చైనాలోని వూక్సీ నగరంలో చెర్నిహివ్ వాణిజ్య మిషన్ అధిపతిగా నియమించారు. అక్కడ ఆమె విదేశీ పెట్టుబడులను తీసుకువచ్చే బాధ్యతను స్వీకరించారు. పూర్తిగా విదేశీ పెట్టుబడులతో స్థాపించబడిన ఎకో-వోటార్ అనే సంస్థ స్థాపనలో పాత్ర పోషించారు. 2015లో ఆమె ప్రభుత్వ సేవలోకి అడుగుపెట్టారు. ఆమె మొదట స్థానిక ప్రభుత్వ సలహాదారుగా, తర్వాత చెర్నిహివ్ ప్రాంత ఆర్థిక అభివృద్ధి విభాగం అధిపతిగా నియమితులయ్యారు. 2017లో ఆమెను డిప్యూటీ గవర్నర్‌గా చేశారు.ఆమె నాయకత్వ సామర్థ్యం వల్ల ఆమె ప్రాంతంలో దాదాపు 340 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఆర్థిక అభివృద్ధి పరంగా ఇది ఉక్రెయిన్ లో మొదటిస్థానంలో నిలిచింది.

Post a Comment

0Comments

Post a Comment (0)