ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ నాలుగు రోజుల అధికార పర్యటన నిమిత్తం బ్రెజిల్ లోని రియో డి జనీరోకు చేరుకున్నారు. ఆయనకు అక్కడి భారత దేశ వలసదారుల సముదాయం అత్యంత ఘన స్వాగతం పలికింది. సంప్రదాయ సంగీతం, నృత్యాలతో ప్రధానిని ఆహ్వానించారు. ముఖ్యంగా 'ఆపరేషన్ సింధూర్' థీమ్పై నిర్వహించిన నృత్య ప్రదర్శనతో సభా ప్రాంగణం మార్మోగింది. అలాగే ఇతర ప్రదర్శనలతో పాటు, బ్రెజిలియన్ సంగీత బృందం భారత ఆధ్యాత్మిక సంగీతాన్ని ప్రదర్శించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇది భారతీయ సాంస్కృతిక విలువలను ప్రదర్శించడమే కాక, అంతర్జాతీయ స్థాయిలో భారత గౌరవాన్ని పెంచింది. ప్రధాని జూలై 6-7 తేదీలలో జరిగే 17వ బ్రిక్స్ దేశాల నేతల శిఖరాగ్ర సమ్మేళనంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ శాంతి, భద్రత, బహుళపక్ష వ్యవస్థల బలోపేతం, ఏఐ వినియోగం, వాతావరణ మార్పు, గ్లోబల్ హెల్త్, ఆర్థిక వ్యవస్థలు వంటి అంశాలపై నేతలతో చర్చించనున్నారు. సమావేశానికి సంబంధించి పలువురు దేశాధినేతలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా మోడీ నిర్వహించనున్నారు. శిఖరాగ్ర సమావేశం అనంతరం బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇన్నాసియో లులా డ సిల్వాతో మోడీ భేటీ కానున్నారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించే దిశగా వ్యాపారం, రక్షణ, ఇంధన రంగం, అంతరిక్ష సాంకేతికం, వ్యవసాయం, ఆరోగ్యం, ప్రజల మధ్య సంబంధాలు వంటి అనేక అంశాలపై చర్చలు జరగనున్నాయి. మోడీ మాట్లాడుతూ రియో డి జనీరోలో బ్రెజిల్ లోని భారతీయలు నాకు చాలా హృదయపూర్వక స్వాగతం పలికారని, వారు భారతీయ సంస్కృతితో ఎంతగా ముడిపడి ఉన్నారో, భారతదేశ అభివృద్ధి పట్ల వారికి ఎంత ఇష్టం ఉందో ఆశ్చర్యంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా భారత వలసదారుల సందడి కూడా రియో డి జనీరో వీధుల్లో కనువిందుగా మారింది. బ్రెజిల్ పర్యటనకు ముందు మోడీ అర్జెంటీనాలో పర్యటించి అక్కడి అధ్యక్షుడు జేవియర్ మిల్లెయితో ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు. అంతకు ముందు ఆయన ట్రినిడాడ్ అండ్ టొబాగో, ఘానా దేశాలను కూడా సందర్శించారు. జూలై 9న మోడీ నామీబియా చేరుకొని, అక్కడ ప్రసంగించనున్నారు.
17వ బ్రిక్స్ దేశాల నేతల శిఖరాగ్ర సమ్మేళనం పాల్గొనడానికి బ్రెజిల్ చేరుకున్న నరేంద్ర మోడీ
July 06, 2025
0
Tags