ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో 17న చేపట్టిన రైల్‌ రోకో కార్యక్రమం వాయిదా : ఎమ్మెల్సీ కవిత

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు, జాగృతి విజయంగా భావిస్తున్నామని కవిత అన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.  అంతకుముందు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి జాగృతి శ్రేణులతో ర్యాలీగా లోయర్‌ ట్యాంక్‌బండ్‌కు వెళ్లారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె నివాళులర్పించారు. ''స్థానిక ఎన్నికలకు ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వ ప్రకటన నేపథ్యంలో ఈనెల 17న చేపట్టిన రైల్‌ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. అయితే మాకు కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. ఆర్డినెన్స్‌ ఇచ్చి వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే అధికారంలోకి వచ్చిన 18 నెలలు ఎందుకు ఆగారు? రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని మేం భావిస్తున్నాం. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారు. రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయి. విద్య, ఉద్యోగాల గురించి కూడా ప్రభుత్వం చెప్పాలి. కేంద్రంలో అధికారంలో ఉన్నందున భాజపా అనుకుంటే ఒకే ఒక్క నిమిషంలో రాజ్యాంగ సవరణ చేసి ఇవ్వగలదు.. కానీ ఇవ్వడం లేదు. దోషమంతా కాంగ్రెస్‌పై నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారేమో. ప్రజలు గమనిస్తున్నారు. బీసీ బిల్లును షెడ్యూల్‌-9లో పెట్టాలి. దీనికోసం బీసీ బిడ్డ, కేంద్రమంత్రి బండి సంజయ్‌ చొరవ తీసుకోవాలి. ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని చెప్పినందున ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణను గమనిస్తాం. దీనిపై ముందుకెళ్లకపోతే రైల్‌ రోకో చేపడతాం'' అని కవిత అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)