వాయువ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీరాల మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆదే ప్రాంతంలో రానున్న 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడేందుకు అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. దీంతో పాటుగా మరోక ద్రోణి విస్తరించి ఉందని పేర్కొన్నారు. వీటి ప్రభావంతో రాష్ట్రంలో నాలుగు రోజులు చెదురుమదురుగా పిడుగులతో కూడిన భారీ వర్షాలు, 40-60కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు, ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భారీ హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వంటి వాటి దగ్గర నిలబడరాదన్నారు. రానున్న నాలుగు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. కాగా, బుధవారం సాయంత్రం 5గంటల నాటికి తూర్పుగోదావరి జిల్లా నాగంపల్లెలో 49 మిమీ, విశాఖ రూరల్ 37.7మిమీ, ఎన్టీఆర్ జిల్లా మునకుళ్ళలో 36.5మిమీ, అల్లూరి జిల్లా కూనవరంలో 35.7మిమీ, విశాఖ జిల్లా ఎండాడలో 35.7మిమీ, సీతమ్మధారలో 35.5మిమీ చొప్పున వర్షపాతం నమోదైందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
బంగాళాఖాతంలో అల్పపీడనం
June 25, 2025
0
Tags