తెలంగాణలో సెప్టెంబర్ 30వ తేదీ లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని జస్టిస్ మాధవి బెంచ్ ఆదేశించింది. ఈ సందర్భంగా ప్రభుత్వం, ఎన్నికల సంఘం అభ్యర్థనలను సైతం పరిగణలోకి తీసుకున్నట్టు ధర్మాసనం తెలిపింది. అందులో భాగంగానే మూడు నెలల్లో ఎన్నికలను నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఇక, రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం లేదంటూ దాదాపు ఆరు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై గత కొన్నాళ్లుగా వాదనలు కొనసాగుతున్నాయి. గతేడాది జనవరి 31తో సర్పంచుల పదవీ కాలం ముగిసినా.. ఇప్పటికీ ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది. సర్పంచులను తప్పించి పంచాయతీల బాధ్యతలను ప్రత్యేక అధికారులకు అప్పగించింది. ఇది రాజ్యాంగ, తెలంగాణ పంచాయతీరాజ్ చట్టాలకు విరుద్ధం. ప్రత్యేక అధికారులు ఇతర విధుల్లో ఉండటంతో ప్రజల సమస్యలను పట్టించుకోవడంలేదు. రాష్ట్ర ఆర్థిక సంఘం ద్వారా నిధులు సమకూరుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీతో పలువురు సర్పంచులు సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేయించారు. ప్రస్తుతం ఆ నిధులు అందక ఇబ్బందులుపడుతున్నారు. వివిధ పథకాల కింద కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రావడంలేదు. వెంటనే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకోవాలి. లేకుంటే పాత సర్పంచులకే బాధ్యతలు అప్పగించాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తికావడానికి మరో నెల రోజుల గడువు అవసరమని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ ఇమ్రాన్‌ఖాన్ కోరారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ఎన్నికల నిర్వహణపై గతంలో ఒకసారి హామీ ఇచ్చి ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది జి.విద్యాసాగర్ వాదనలు వినిపిస్తూ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. ఇది పూర్తికాగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపాక ప్రక్రియ పూర్తి చేయడానికి రెండు నెలల సమయం పడుతుందన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ సకాలంలో ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఎన్నికల సంఘం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసినందున... ఆ దిశగా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. న్యాయవాది సమాధానమిస్తూ..రిజర్వేషన్ల ఖరారుతో పాటు ఎన్నికలకు ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఎన్నికల నిర్వహణకు నెల రోజుల గడువు ఇవ్వాలని ప్రభుత్వం కోరగా.. ఎన్నికల సంఘం 60 రోజులు గడువు కోరింది. వాదనలు విన్న ధర్మాసనం జూన్ 23వ తేదీన తీర్పును రిజర్వు చేసింది. ఇవాళ ఆ తీర్పును వెల్లడించింది. కాగా, 2024 ఫిబ్రవరి 1వ తేదీ నాటికి తెలంగాణ సర్పంచ్‌ల పదవీ కాలం ముగిసింది. దాంతో ఆరు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని నిబంధనను గుర్తు చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికలైనా పెట్టండి.. లేదా పాత సర్పంచ్‌లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు.
మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి : తెలంగాణ హైకోర్టు
June 25, 2025
0
Tags