ఇరాన్ అణు ముప్పును తప్పించేందుకు ఆపరేషన్ రైజింగ్ లయన్ చేపట్టినట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు శుక్రవారం ప్రకటించారు. ఈ క్రమంలో ఇరాన్‌పై 24 గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ సైన్యం రెండుసార్లు వైమానిక దాడులకు పాల్పడింది. ప్రతిగా ఇరాన్ కూడా దాడులు జరిపింది. డ్రోన్లతో జరిపిన దాడులను ఐడీఎఫ్ తిప్పికొట్టగలిగింది కానీ, క్షిపణుల దాడిలో మాత్రం దెబ్బ తింది. ఏకంగా రాజధాని టెల్ అవీవ్‌లో అదీ రక్షణ ప్రధాన కార్యాలయంపై దాడి జరగ్గా ఏ రక్షణ వ్యవస్థ అడ్డ్డుకోలేకపోయింది. ఆకాశంలో క్షిపణులు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్ ప్రజలు ఏమాత్రం వణికిపోకుండా తమ పని తాము చేసుకుంటారు. ఎందుకంటే ఐరన్ డోమ్ ఉందనే ధైర్యం. కానీ, శనివారం భీకర యుద్ధంలో ఇరాన్ వందలాది బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. ఈ క్రమంలో రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్‌ను చీల్చుకుంటూ మిస్సైల్స్ దూసుకెళ్లాయి. పెద్ద శబ్దంతో దూసుకొచ్చిన మిస్సైల్ సెకన్ల వ్యవధిలోనే భవనాన్ని తాకింది. ది టైమ్స్ ఈ 19 సెకన్ల వీడియోను ధృవీకరించింది. మిస్సైల్ నేరుగా రక్షణ కార్యాలయాన్ని ఢీ కొట్టింది. అయితే అక్కడ జరిగిన నష్టం వివరాలు తెలియాల్సి ఉంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను వినియోగిస్తోంది. ఇతర భూభాగాల నుంచి రాకెట్లను ఇజ్రాయెల్‌పై ప్రయోగిస్తే రాడార్ వ్యవస్థ దాన్ని అధ్యయనం చేస్తుంది. అనంతరం క్షిపణులు వెళ్లి ఆ రాకెట్‌ను అడ్డుకుంటాయి. అయితే శనివారం నాడు నిమిషాల వ్యవధిలోనే వేలాది రాకెట్లను ఇరాన్ ప్రయోగించింది. కానీ, వాటిని అడ్డుకోవడంలో ఈ వ్యవస్థ విఫలమైంది. ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో మూడు దశలు ఉంటాయి. యారో-2, యారో-3 సిస్టమ్స్‌ను బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి ఆకాశంలోనే బాలిస్టిక్ క్షిపణులను పేల్చేసి వాటి శకలాల నుంచి ముప్పును దూరం చేస్తాయి. ఆపై డేవిడ్ స్లింగ్ మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. 100-200 కిలోమీటర్ల స్వల్పశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి వాడతారు. అంతేకాదు యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేయడంలోనూ దీనిదే కీలక పాత్ర. ఇక చిట్టచివరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. దీనిని ఇజ్రాయెల్ విస్తృతంగా వాడుతుంది. హమాస్, హెజ్‌బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేసింది. ఇజ్రాయెల్‌కు అసలైన రక్షణ కవచంగా నిలిచింది. దూసుకొచ్చే ఒక్కో ముప్పును పేల్చేయడానికి రెండు క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు 50 వేల డాలర్లు ఖర్చవుతుందని అంచనా.ఐరన్ డోమ్‌ను స్థానికంగా కిప్పాట్ బర్జెల్‌గా వ్యవహరిస్తారు. ఇది స్వల్పశ్రేణి ఆయుధాలను అడ్డుకొంటుంది. దీనిలో రాడార్, కంట్రోల్ సెంటర్, మిసైల్ బ్యాటరీ ఉంటాయి. రాడార్ తొలుత దూసుకొస్తున్న ముప్పును పసిగడుతుంది. అది ఎక్కడ నేలను తాకుతుందో అంచనావేస్తుంది. అక్కడ ఎటువంటి నిర్మాణాలు లేకపోతే వదిలేస్తుంది. అదే జనావాసాలు అయితే మాత్రం రాకెట్‌ను ప్రయోగించి దానిని ధ్వంసం చేస్తుంది. ఈ వ్యవస్థ తయారీలో ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్టా, ఎంప్రెస్ట్ సిస్టమ్, రఫెల్ సంస్థలు పనిచేశాయి.
ఐరన్ డోమ్‌ను చీల్చుకుంటూ దూసుకెళ్లిన మిస్సైల్స్
June 14, 2025
0
Tags