తొక్కిసలాట సమయంలో విధుల్లో వెయ్యి మంది పోలీసులు : కర్ణాటక హైకోర్టుకు ప్రభుత్వం వెల్లడి

Telugu Lo Computer
0


బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవాల వేళ బెంగళూరులో సంభవించిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరును రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానానికి వివరించింది. ఘటన సమయంలో చిన్నస్వామి స్టేడియం పరిసర ప్రాంతాల్లో 1000 మందికి పైగా పోలీసులు మాత్రమే విధుల్లో ఉన్నట్లు తెలిపింది. అయితే, అంతకుముందు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ ఆర్సీబీ ఈవెంట్‌కు 5వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పడం గమనార్హం. తొక్కిసలాట ఘటనపై విమర్శలు రావడంతో ఈ వ్యవహారాన్ని హైకోర్టు సుమోటోగా పరిగణించింది. ''వేడుక కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం విషాదంగా మారింది. ఈ దుర్ఘటన వెనుక కారణాలను తేల్చాల్సిన అవసరం ఉంది. ఇలాంటి ఘటనలను మనం నివారించగలమా? భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే ఏం చేయగలం? అన్నవి ఆలోచించాలి'' అని హైకోర్టు అభిప్రాయపడింది. అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదిస్తూ ''రద్దీని దృష్టిలో ఉంచుకుని అన్ని భద్రతా ఏర్పాట్లు చేశాం. వాటర్‌ ట్యాంకర్లు, అంబులెన్స్‌లు, కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ వాహనాలను సిద్ధంగా ఉంచాం. ఈ స్టేడియం సామర్థ్యం 35వేలు మాత్రమే. సాధారణ సమయాల్లో 30వేల టికెట్లు మాత్రమే ఇస్తారు. కానీ, నిన్నటి కార్యక్రమానికి దాదాపు 2.5లక్షల మందికి పైగా అభిమానులు వచ్చారు. అందరినీ లోపలికి పంపిస్తారని వారు భావించారు. మధ్యాహ్నం నుంచే రద్దీ మొదలవ్వగా.. సాయంత్రానికి కిక్కిరిసిపోయి పరిస్థితి చేయిదాటిపోయింది'' అని వివరించారు. తాము నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించలేదని ప్రభుత్వం ఈ సందర్భంగా తెలిపింది. ఈ విషయంలో న్యాయస్థానం ఎలాంటి ఆదేశాలిచ్చినా పాటించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొంది. వాదనలు విన్న ధర్మాసనం దీనిపై తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)