కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Telugu Lo Computer
0


తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి ఉపయోగం కన్నా నష్టం ఎక్కువగా కలిగించిందని, దీనిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ  నివేదిక ఇచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ లేనిదిగా బీజేపీ గతంలోనే చెప్పిందని, ఇప్పుడు కూడా సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సీబీఐ విచారణపై మొహం మార్చుకుందని వ్యాఖ్యానించారు. అలాగే బీసీ గణనపై మాట్లాడుతూ, దేశ స్వాతంత్రం తర్వాత తొలిసారి బీసీ జనాభా సేకరణ జరుగుతోందని పేర్కొన్నారు. జనగణనలో వ్యక్తిగత సమాచారం గోప్యంగా ఉంటుందని స్పష్టం చేశారు. మోడీ 11 ఏళ్ల పాలనపై బీజేపీ చేపట్టిన కార్యక్రమాలకు ప్రజలు విశేషంగా స్పందిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం సమయం తీసుకుంటోందని చెప్పారు. ఇప్పటికే ఎన్నికలు ఆలస్యం అయ్యాయని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రజాస్వామ్య స్ఫూర్తితో జరగాలే కానీ తూతూ మంత్రంగా కాకూడదని హితవు పలికారు. అన్ని స్థానాల్లో బీజేపీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని చెప్పారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో బీజేపీ పిటిషన్ వేసిందని, అది పెండింగ్‌లో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం సీబీఐకి కేసు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. తమ ఫోన్లను ట్యాప్ చేశారన్నది హైకోర్టుకు ఇచ్చిన ప్రభుత్వ నివేదికలో కూడా ఉందని వెల్లడించారు. అలాగే గోదావరి జలాల విషయంపై రాష్ట్రాల మధ్య సంప్రదింపులు జరిపి పరిష్కారం వెతుకుతామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలన్నది ఆయన అభిప్రాయం. రెండు రాష్ట్రాల ప్రజలు “మనవారే” అనే భావనతో కలిసి పనిచేయాలన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)