విజయనగరంలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను వంచించిన ముఠా అరెస్టు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ సెక్రటేరియట్‌లో అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి విజయనగరంలో ఏడుగురు నిరుద్యోగుల నుంచి రూ.53 లక్షలు వసూలు చేసిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ అపాయింట్‌మెంట్‌ ఆర్డర్లను సృష్టించి నిందితులు రూ.53 లక్షలు కాజేశారు. ఈ మేరకు నలుగురుని విజయనగరం ఒకటో పట్టణం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.6 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను విజయనగరం డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు శనివారం మీడియాకు వెల్లడించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని ప్రదీప్ నగర్‌కు చెందిన నిందితుడు కె.సాయి వెంకట్ సుజిత్.. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని, ఆసక్తి ఉన్నవారు తనను సంప్రదంచాలని ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. దానిని చూసిన విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి ప్రాంతాలకు చెందిన ఏడుగురు నిరుద్యోగ యువకులు సుజీత్‌ను సంప్రదించారు. విజయవాడలోని సెక్రటేరియట్‌లో పలు ప్రభుత్వ విభాగాల్లో ఔట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఉద్యోగాలు వేయిస్తామని చెప్పి వారి నుంచి రూ.53 లక్షలు తీసుకొని మోసం చేశాడు. నకిలీ అపాయింట్‌మొంట్‌ ఆర్డర్లు సృష్టించి వారికి అందించారు. ఏడుగురు బాధితులను విజయవాడ తీసుకొచ్చి నెల రోజుల పాటు అక్కడే ఉంచారు. తొందర్లోనే మీకు సమచారం ఇస్తామని చెప్పి వారిని వెళ్లిపొమ్మన్నారు. ఎంతకీ ఎలాంటి సమాచారం రాకపోవడంతో బాధితుల్లో ఒకరైన ఎస్.కోటకు చెందిన ఎస్.వినోద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. సీఐ ఎస్. శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో ఐదుగురు ఏపీ వాసులు, నలుగురు హైదరాబాద్‌కు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిపై కేసు నమోదు అయిందనే విషయం తెలిసిన వెంటనే నిందితులు పరారయ్యారు. ముఠాలో కీలక నిందితుడైన సాయి వెంకట్ సుజిత్‌కు ఆరోగ్యం బాగోలేదని చూసేందుకు మిగతా నిందితులు సీహెచ్ మహేష్, రూబిన్ కుమార్, జాన్, యాకూబ్ విజయనగరం వస్తున్నట్లు పోలీసులకు సమాచారం వెళ్లింది. అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మాటువేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నేరం చేసినట్లు అంగీకరించారు. హైదరాబాద్‌లో నకిలీ ఐడీ కార్డులు, అపాయింట్‌మెంట్ ఆర్డర్లు తయారు చేసినట్లు విచారణలో తేలింది. పరారీలో ఉన్న మిగిలిన నిందితులనూ త్వరలోనే పట్టుకుంటామని డీఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు సుజిత్‌ కోలుకోగానే అరెస్ట్ చేస్తామన్నారు. కేసు ఛేదించినందుకు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ ప్రసన్నకుమార్, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)