ఇజ్రాయిల్ తమపై దాడిచేసి ఘోర తప్పిదం చేసిందని, అందుకు మూల్యం అనుభవించక తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయుతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. ఇజ్రాయిల్ దాడుల వేళ ఆయన వీడియో సందేశం విడుదల చేశారు. ఇరాన్ ఎప్పటికీ లొంగిపోదనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. అమెరికా అధ్యక్షుడు హెచ్చరికలను ఉద్దేశిస్తూ అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుందని అన్నారు. అంతేకాదు, యుద్దంలో అమెరికా జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం తప్పదని, ఆ విషయం అమెరికన్లకు బాగా తెలుసని ఖమేనీ స్పష్టం చేశారు. మరోవైపు, ఇజ్రాయిల్ గూఢచారి సంస్థలకు వాట్సాప్ ద్వారా సమాచారం చేరుతుందనే అనుమానంతో వెంటనే యాప్‌ను డిలీట్ చేయాలని ఇరాన్ సూచించింది. ఇజ్రాయిల్ తో కొనసాగుతున్న ఘర్షణలో అమెరికా జోక్యం చేసుకుంటే పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సైతం హెచ్చరించారు. 'అమెరికా తన స్థానంలోనే ఉండాలని, లేకుంటే భారీ విధ్వంసం తప్పదు' అని హెచ్చరించారు మరోవైపు, ఇరాన్‌ను ఎదుర్కోటానికి ఇజ్రాయేల్ అత్యంత జాగ్రత్తగా ఉంటుందని ఐడీఎఫ్ పేర్కొంది. ఇరాన్ ఆత్మరక్షణ హక్కును టర్కీ సమర్దించింది. యుద్ధం మరింత తీవ్రతరమయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయేల్ యుద్ధంలో అమెరికా రంగప్రవేవం చేస్తూ అత్యంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుంది అని ఆందోళన వ్యక్తమవుతోంది. పోరాటం ప్రారంభమైందని ఖమేనీ ప్రకటిస్తూ యుద్ధానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితులున్నాయని సూచించారు. కాగా, ఒకప్పుడు అమెరికాను కాదని, ఇరాన్-ఇజ్రాయిల్ లు చెట్టపట్టాలేసుకుని తిరగడం గమనార్హం. ఇరాన్ పశ్చిమ ప్రాంతాల్లోని 40కంటే ఎక్కువ లక్ష్యాలపై భారీ ఎత్తున వైమానిక దాడులు జరిపినట్టు ఇజ్రాయిల్ రక్షణ దళాలు బుధవారం అధికారికంగా ప్రకటించాయి. 'ఈ ఉదయం, ఇంటెలిజెన్స్ ఆదేశాల మేరకు, ఎయిర్ ఫోర్స్ ఫైటర్ జెట్లు పశ్చిమ ఇరాన్‌లోని సైనిక లక్ష్యాలపై దాడులు మొదలుపెట్టాయి' అని ఎక్స్ (ట్విట్టర్)లో తెలిపాయి. ఈ దాడుల్లో సుమారు 25 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. ఇజ్రాయేల్‌ను లక్ష్యంగా చేసుకున్న క్షిపణి వ్యవస్థలు, ఆయుధ నిల్వ కేంద్రాలు, ఇరాన్ ప్రభుత్వ అనుబంధ సిబ్బందిపై దాడులు చేశాయని సమాచారం.
ఇజ్రాయిల్ తమపై దాడిచేసి ఘోర తప్పిదం చేసింది : అయుతుల్లా అలీ ఖమేనీ
June 18, 2025
0
Tags