యాపిల్‌ వ్యూహాత్మక చర్యలు : భారత్‌ నుంచి అమెరికాకు 97 శాతం ఐఫోన్ల ఎగుమతి

Telugu Lo Computer
0


మెరికా చైనాపై విధించిన సుంకాలను ఎదుర్కొనే ప్రక్రియలో భాగంగా యాపిల్‌ వ్యూహాత్మక చర్యలు చేపట్టింది. భారత్‌ నుంచి అమెరికాకు ఐఫోన్‌ ఎగుమతులను గణనీయంగా పెంచింది. ఈ ఏడాది మార్చి-మే మధ్య భారత్‌ నుంచి ఎగుమతి చేసిన ఐఫోన్‌లలో 97 శాతం అమెరికాకు చేరాయి. గతంలో భారత్‌ నుంచి నెదర్లాండ్‌, బ్రిటన్‌ వంటి దేశాలకు ఐఫోన్లు ఎక్కువగా ఎగుమతయ్యేవి. కానీ ఇప్పుడు పూర్తిగా అమెరికాపై యాపిల్‌ దృష్టి కేంద్రీకరించింది. చైనా నుంచి ఎగుమతి చేసే ఐఫోన్‌లపై అధిక సుంకాలు ఉండటంతో యాపిల్‌ భారత్‌లో ఉత్పత్తిని వేగవంతం చేసింది. మార్చి-మే మధ్య కాలంలో భారత్ నుంచి 3.2 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్లను అమెరికాకు ఎగుమతి చేసింది. మార్చిలో రికార్డు స్థాయిలో 1.3 బిలియన్‌ డాలర్లు, మేలో 1 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్‌లను అమెరికాకు పంపింది. ఈ ఏడాది మొదటి ఐదు నెలల్లోనే 4.4 బిలియన్‌ డాలర్ల విలువైన ఐఫోన్‌లను ఎగుమతి చేసింది. ఇది గతేడాదిలో ఎగుమతైన 3.7 బిలియన్‌ డాలర్ల ఐఫోన్ల విలువ కంటే ఎక్కువ. అమెరికా భారత్‌పై విధించిన అదనపు 26 శాతం సుంకాలను జులై 9 వరకు తాత్కాలికంగా నిలిపివేసిన నేపథ్యంలో అదనపు సుంకాన్ని నివారించేందుకు భారత్‌ చర్చలు కొనసాగిస్తోంది. ఈ 90 రోజుల వ్యవధిని ఉపయోగించుకొని ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇక 10 శాతం బేస్‌లైన్‌ సుంకం యథాతథంగా కొనసాగుతుంది. మరోవైపు చైనా, అమెరికా దేశాలు సుంకాలను తగ్గించే ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)