ఫ్రాన్స్‌లో జరిగిన ఫుట్‌బాల్ ఛాంపియన్స్ లీగ్ పోటీల్లో పారిస్ సెయింట్-జర్మైన్ క్లబ్ జట్టు ఇంటర్ మిలన్ జట్టుపై విజయంతో సంబరాలు జరుపుకొంటున్న సమయంలో ప్రత్యర్థి జట్టు అభిమానులకు పీఎస్‌జీ అభిమానులకు మధ్య జరిగిన వాగ్వాదాలు ఘర్షణకు దారి తీశాయి. అవి హింసాత్మకంగా మారడంతో జరిగిన ఘర్షణల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, 192మంది గాయపడినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. పారిస్ వీధుల్లో మొదలైన వేడుకలు హింసాత్మకంగా మారడంతో భద్రతాదళాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించారు. నిరసకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారని, బస్ షెల్టర్లను ధ్వంసం చేశారని తెలిపాయి. వేలాదిమంది స్టోర్లు, దుకాణాల్లో చొరబడి..అందులోని వస్తువులను దోచుకున్నారని..అడ్డుకోవడానికి ప్రయత్నించిన భద్రతా బలగాలపై దాడులు చేశారని అధికారులు పేర్కొన్నారు. ఫుట్‌బాల్ అభిమానుల్లో అసాంఘికశక్తులు కలిసిపోయి ఈ దారుణాలకు పాల్పడ్డారని తెలిపారు. ఘర్షణలకు కారణమైన వారిలో 559 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి.
పారిస్ లో ఫుట్‌బాల్ అభిమానుల మధ్య ఘర్షణ : ఇద్దరు మృతి,192మందికి గాయాలు
June 01, 2025
0
Tags