అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం తిరిగి ప్రారంభం ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లి ఉన్నత విద్యను చదువుకోవాలనుకునే విద్యార్థులకు ఆర్థికంగా సహాయం చేయడానికి అంబేద్కర్ ఓవర్సీస్‌ విద్యానిధి పథకాన్నిమళ్లీ  ప్రభుత్వం అమలు చేయనుంది. ఈ స్కీమ్ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈ బీసీ, కాపు వర్గాలలోని పేద విద్యార్థులు అవకాశం కల్పించనుంది. ఈ స్కీమ్‌పై అధికారులు దృష్టి సారించారు. అంబేద్కర్ ఓవర్సీస్‌ విద్యానిధి పథకం కింద అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ.25 లక్షలు సహాయం చేయనుంది. బీసీ, మైనారిటీలకు రూ.20 లక్షలు సహాయం చేయనుంది. ఇక ఈ బీసీ, కాపు విద్యార్థులకు రూ.15 లక్షలు ఇవ్వాలన్నది ప్రతిపాదన. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు అదనంగా నిర్వహణ ఖర్చుల కోసం మరో ఐదు లక్షలు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ స్కీమ్ కింద ఎక్కువ మంది విద్యార్థులకు లబ్ధి చేకూరేలా కొత్త మార్గదర్శకాలు అధికారులు రూపొందిస్తున్నారు. క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ఆధారంగా టాప్‌-250 యూనివర్సిటీల్లో సీటు వచ్చిన విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేలా ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త పథకం వల్ల పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించడానికి మంచి అవకాశం లభిస్తుందని అంటున్నారు మంత్రి లోకేష్. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకాన్ని మళ్లీ ప్రారంభించడానికి కావలసిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం ఓవర్సీస్ విద్యా పథకం అమలు చేసింది. దీనివల్ల చాలామంది లబ్ది పొందారు కూడా. వైసీపీ హయాంలో విదేశీ విద్య పథకానికి పేరు మార్చారు. విద్యార్థులను ఫిల్టర్ చేసేందుకు క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ప్రకారం టాప్‌-50 వర్సిటీల్లో ప్రవేశాలు పొందినవారికి సాయం అందేలా ఈ పథకానికి తెచ్చారు. దీనిపై వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం క్యూఎస్‌ ర్యాంకింగ్‌ ప్రాతిపదికగా తీసుకుంటోంది. కాకపోతే టాప్‌-250 యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందినవారికి ఆర్థికసాయం అందించనుంది. ఈ పథకానికి సంబంధించిన త్వరలో పూర్తి వివరాలు ప్రభుత్వం వెల్లడించనుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)