ట్రంప్ దూకుడుకు బ్రేక్ వేస్తూ వాణిజ్య న్యాయస్థానం ఆదేశాలు జారీ

Telugu Lo Computer
0


మెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశీ వస్తువులపై భారీ సుంకాలు విధిస్తూ దారికి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న డొనాల్డ్ ట్రంప్ కు ఇవాళ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.  ట్రంప్ దూకుడుకు బ్రేక్ వేస్తూ అమెరికా కోర్టు సంచలన ఆదేశాలు ఇచ్చింది. అంతేకాదు వాణిజ్యం కోసం భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ ప్రకటించేలా మధ్యవర్తిత్వం చేశానంటూ ట్రంప్ చేస్తున్న వాదనకూ చెక్ పెట్టింది. అమెరికాకు అవసరం లేకపోయినా భారీ ఎత్తున వస్తువులు ఎగుమతి చేస్తూ, అమెరికా వస్తువులు కొనేందుకు ఇష్టపడని దేశాలపై ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న చర్యలకు ఆ దేశ వాణిజ్య న్యాయస్థానం చెక్ పెట్టింది. ట్రంప్ ఈ విషయంలో తన అధికారాల్ని అతిక్రమించారని తెలిపింది. జాతీయ అత్యవసర పరిస్థితిలో అసాధారణ ముప్పులను పరిష్కరించడానికి ఉద్దేశించిన అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద ప్రపంచ సుంకాలను నిర్ణయించడానికి ప్రభుత్వానికి విస్తృత అధికారం ఉందన్న అమెరికన్ కమాండర్ ఇన్ చీఫ్ వాదననూ తోసిపుచ్చింది. ట్రంప్ నిర్ణయాలకు బ్రేక్ వేస్తూ తీర్పు ఇస్తే అది చైనాతో వాణిజ్య ఒప్పందాల గతిని మారుస్తుందని, అలాగే భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ నిర్ణయాన్ని దెబ్బతీస్తుందంటూ ట్రంప్ సర్కార్ చేసిన వాదననూ అమెరికా కోర్టు తోసిపుచ్చింది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదుల దాడి తర్వాత అణుశక్తులైన భారత్-పాకిస్తాన్ మధ్య ట్రంప్ తన సుంకాల విధింపు అధికారం వాడి కాల్పుల విరమణకు ఒప్పించినట్లు అధికారులు వాదించారు. అయినా కోర్టు అంగీకరించలేదు. ప్రస్తుతం అనేక దేశాలతో సుంకాలపై వాణిజ్య చర్చలు జరుగుతున్నాయని, జూలై 7న వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేయడానికి గడువు ఉన్నందున ఈ సమస్య ప్రస్తుతం సున్నితమైన స్థితిలో ఉందని కోర్టుకు అధికారులు తెలిపారు. అయితే ఈ వాదనలన్నింటినీ మాన్‌హట్టన్‌కు చెందిన ముగ్గురు న్యాయమూర్తుల అంతర్జాతీయ వాణిజ్య న్యాయస్థానం తోసిపుచ్చింది. అత్యవసర అధికారాల చట్టం కింద అధ్యక్షుడికి అపరిమిత అధికారాలు అప్పగించలేదని తేల్చిచెప్పింది. అత్యవసర పరిస్థితిలో అవసరమైన ఆర్థిక ఆంక్షలు విధించడానికి మాత్రమే అధ్యక్షుడికి అధికారం ఉందని స్పష్టం చేసింది. అమెరికా ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి, అధ్యక్షుడి అత్యవసర అధికారాల ద్వారా నియంత్రించలేని విదేశాలతో వాణిజ్య నియంత్రణకు అమెరికా రాజ్యాంగం కాంగ్రెస్‌కు ప్రత్యేక అధికారాన్ని ఇస్తుందని కోర్టు తెలిపింది. అధ్యక్షుడికి మాత్రం ఈ అధికారం లేదని క్లారిటీ ఇచ్చింది. సుంకాల విధింపు అధికారాన్ని అపరిమితంగా అప్పగించడం అనేది ప్రభుత్వంలోని మరొక శాఖకు శాసన అధికారాన్ని అనుచితంగా వదులుకోవడమే అవుతుందని తీర్పులో తెలిపింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)