పోలవరం అభ్యంతరాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న ప్రధాని మోడీ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ ప్రజల కలల ప్రాజెక్టు పోలవరంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాజెక్టుపై వివిధ రాష్ట్రాలకు నెలకొన్న అభ్యంతరాలపై చర్చించి తొలగించేందుకు నిర్ణయించారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం జాతీయ హోదా ఇవ్వడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా తీసుకుంది. అందుకే అభ్యంతరాలు కూడా కేంద్రమే తొలగించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రధాని మోడీ తొలిసారి సమీక్షించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. పోలవరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జల వివాదాల ట్రిబ్యునల్‌లో భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక మధ్య పంచుకునే నీటిలో 80 టీఎంసీల నీటిని గోదావరి నుంచి కృష్ణా నదికి మళ్లించనున్నారు. ఇదే ప్రాజెక్టు నుంచి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రానికి 1.5 టీఎంసీల నీరు, ఒడిశా రాష్ట్రానికి 5 టీఎంసీలు ఇవ్వాల్సి ఉంది. వీటితో పాటు బ్యాక్ వాటర్ జలాలపై ముంపుకు గురి కానున్న తెలంగాణ, ఒడిశా, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని ప్రాంతాలపై చర్చించనున్నారు. వాస్తవానికి తెలంగాణలో ఏడు మండలాలు పోలవరం ప్రాజెక్టులో ముంపు ప్రాంతాలుగా ఉండేవి. వీటిని రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ లో కలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)