హైదరాబాద్ లోని కొత్తపేట వైష్ణవి రుతిక అపార్టుమెంట్‌లో ఈ నెల 21న పార్కింగ్ విషయమై జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మృతుడి భార్య అన్నపూర్ణ వివరాల ప్రకారం ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి (48) రియల్ ఎస్టేట్ వ్యాపారి. 13 ఏళ్లుగా కొత్తపేట వైష్ణవి రుతిక అపార్టుమెంట్‌లో ఉంటున్నారు. అదే అపార్టుమెంట్ ఫ్లాట్ నంబరు-402లో అద్దెకు ఉంటున్న సూరి కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు రాజమండ్రికి చెందిన కృష్ట జివ్వాజి వచ్చారు. ఆయన కారును అపార్టుమెంట్ ఆవరణలో పార్క్‌చేశాడు. గండ్ర నాగిరెడ్డి బయట నుంచి వచ్చి.. కృష్ణ కారు వెనక తన కారు నిలిపాడు. కృష్ణ జివ్వాజి వెళ్లిపోయేందుకు కిందికి రాగా.. తన కారుపై గీతలు కనిపించాయి. అందుకు నాగిరెడ్డి కారణమని, వాచ్‌మెన్‌తో అతడ్ని కిందికి రప్పించి దాడి చేశాడు. చెవిలోంచి రక్తం, నోటి నుంచి నురగ వచ్చి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించగా, మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. అదే రోజు రాత్రి మృతుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాగిరెడ్డి కింద పడగానే, దాడి చేసిన కృష్ణ పరారయ్యాడు. కామాక్షి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులు స్వగ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. కేసు గురించి మీడియాకు వెల్లడించక పోవడంతో పాటు నిందితుడిని అరెస్టు చేయకపోవడాన్ని అపార్టుమెంట్ వాసులు ప్రశ్నించడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
ప్రాణం తీసిన అపార్టుమెంట్‌లో పార్కింగ్ గొడవ
May 30, 2025
0
Tags