బస్సులో మర్చిపోయిన రూ.13 లక్షల విలువగల బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో ఉన్న బ్యాగును ప్రయాణికుడికి అందజేసి టీజీఎస్ ఆర్టీసీ అచ్చంపేట డిపోకండక్టర్ వెంకటేశ్వర్లు నిజాయితీ నిరూపించుకున్నారు. అచ్చంపేట - హైదరాబాద్ రూట్ టీజీఎస్ఆర్టీసీ బస్సులో ఈ నెల 26న కండక్టర్ వెంకటేశ్వర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎంజీబీఎస్ కు చేరుకోగానే బస్సులో ఒక బ్యాగ్ ను ప్రయాణికుడు మరచిపోయినట్లు కండక్టర్ గుర్తించారు. బ్యాగును తెరిచి చూడగా అందులో బంగారు, వెండి ఆభరణాలు, నగదు సహా పలు సర్టిఫికెట్లు ఉన్నాయి. వెంటనే ఈ విషయాన్ని అచ్చంపేట డీఎం మురళీ దుర్గా ప్రసాద్ కు ఫోన్ లో సమాచారం అందించారు. దీంతో బ్యాగును ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయంలో అప్పగించాలని డీఎం సూచించారు. ఆ సమయంలోనే అనిల్ కుమార్ అనే ప్రయాణికుడు డీఎంకి ఫోన్ చేసి బస్సులో బ్యాగును మరచిపోయినట్లు చెప్పారు. కందుకూర్ లో బస్సు ఎక్కి సీబీఎస్ లో దిగి కాచిగూడకు వెళ్లిపోయానని పేర్కొన్నారు. ఎంజీబీఎస్ లోని స్టేషన్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలని డీఎం సూచించారు. టీజీఎస్ ఆర్టిసీ అధికారులు వివరాలను పరిశీలించి బ్యాగును ప్రయాణికుడు అనిల్ కుమార్ కు అందజేశారు. అందులో 14 తులాల బంగారు, 10 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.14,800 నగదు, కుమారుడి బర్త్ సర్టిఫికెట్, తన విద్యార్హత ధ్రువపత్రాలు ఉన్నాయి. ఈ ఘటనతో వెంకటేశ్వర్లును టీజీఎస్ఆర్టిసీ యాజమాన్యం అభినందించింది. హైదరాబాద్ బస్ భవన్ లో ఉన్నతాధికారులతో కలిసి సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆయనను సన్మానించి, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూనే ఆర్టీసీ సిబ్బంది ఈ రకంగా వ్యవహరించడాన్ని కొనియాడారు.
నిజాయితీ నిరూపించుకున్న కండక్టర్ కు వీసీ సజ్జనార్ సన్మానం
April 29, 2025
0
Tags