సినీ నటుడు మహేష్ బాబు అధికారులు నోటీసులు జారీ చేశారు.ఈ నెల 28న ఉదయం 10.30కి విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులలో పేర్కొన్నారు. సురానా, సాయిసూర్య డెవలపర్స్ మనీ ల్యాండరింగ్ కేసులో ఆయనకు నోటీసులు జారీ అయ్యాయి. అయితే, మహేష్ బాబు ఆ రెండు కంపెనీలకు ప్రమోషన్స్ చేసేందుకు గాను చెక్కు రూపంలో రూ.3.4 కోట్ల, లిక్విడ్ క్యాష్ రూ.2.5 కోట్లు అంటే మొత్తం రూ.5.90 కోట్ల పారితోషికం తీసుకున్నట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు. మనీ ల్యాండరింగ్‌కు పాల్పడిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆయన ప్రజలను ఇన్‌ఫ్లుయెన్స్ చేశారనే అభియోగంపై ఆయనకు ఈడీ నోటీసులు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. కాగా, ఇటీవలే ఈడీ అధికారులు సురానా, సాయి సూర్య డెవలపర్స్ సంస్థలపై దాడులు చేశారు. సోదాల్లో భాగంగా సికింద్రాబాద్ బోయిన్‌పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో భారీగా నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ, సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీశ్ చంద్రగుప్త ఇంట్లో కూడా భారీగా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య, సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితమే సాయిసూర్య డెవలపర్స్‌కు చెందిన సతీశ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వట్టినాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీశ్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా సాయిసూర్య డెవలపర్స్పై ఈడీ విచారణ చేపట్టింది. సురానా సంస్థ పలు షెల్ కంపెనీ లను ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. బ్యాంకులో నుంచి తీసుకున్న రుణంతో షెల్ కంపెనీలకు నిధుల బదిలీలు చేసినట్లుగా విచారణలో తేలింది. ఆ మొత్తాన్ని పెద్ద మొత్తంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు తేల్చారు. ఈ వ్యవహారంపై ఈడీ మరింత లోతుగా విచారణ జరిపింది. కాగా, సురానా గ్రూప్‌కు అనుబంధంగా పనిచేస్తున్న సాయిసూర్య డెవలపర్స్ హైదరాబాద్‌లో పలు కంపెనీలకు అక్రమంగా భూములను అమ్మినట్లు తేలడంతో.. ఈడీ అధికారులు తనిఖీలు చేశారు. మరోవైపు మైనింగ్, కాపర్, సోలార్ వ్యాపారాల్లో ఉన్న సురానా గ్రూప్స్ పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు గుర్తించి, ఈడీ దాడులు చేసింది.
నటుడు మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
April 22, 2025
0
Tags