తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం లభించింది. రాజకీయాలకు అతీతంగా బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఆమోద ముద్ర పడింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. అనంతరం సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన సభ్యులందరికీ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలకు తావు లేకుండా అన్ని పార్టీలు వర్గీకరణ బిల్లుకు మద్దతు తెలిపడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మకమైన సందర్భం అని.. ఎన్నో ఏళ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ కోసం అనేక పోరాటాలు జరిగాయని.. ఎందరో ఈ పోరాటంలో చనిపోయారని వాపోయారు. దళితులకు అండగా ఉంటూ వారి అభ్యున్నతికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 1960 లోనే ఉమ్మడి రాష్ట్రంలో దామోదరం సంజీవయ్య లాంటి దళితుడిని ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని ఆయన కొనియాడారు. అలానే దళితుడు అయిన మల్లికార్జున ఖర్గేను ఏఐసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ నియమించిందని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా న్యాయవాదితో సుప్రీం కోర్టులో వాదనలు వినిపించామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. న్యాయస్థానం తీర్పు ఇచ్చిన వెంటనే వర్గీకరణకు అనుకూలంగానే శాసనసభలో తీర్మానం చేశామన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశామని.. సబ్ కమిటీ సూచన మేరకు ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేశామన్నారు. వన్ మెన్ కమిషన్ ఇచ్చిన నివేదికను తూచ తప్పకుండా ఆమోదించామని వెల్లడించారు. ఇందిరమ్మ రాజ్యంలో ఎవరికి అన్యాయం జరగదు అని స్పష్టం చేశారు. రిజర్వేషన్లను పెంచి వాటిని అమలు చేసే బాధ్యత తీసుకుంటామన్నారు రేవంత్ రెడ్డి. ఎస్సీలలో 59 ఉప కులాలు ఉండగా.. ఆ కులాలను మూడు గ్రూపులుగా విభజించామని ముఖ్యమంత్రి తెలిపారు. మొదటి గ్రూప్ లో 15 ఉప కులాలు ఉండగా.. వారికి ఒక శాతం రిజర్వేషన్ ఇచ్చామన్నారు. రెండో గ్రూపులో 18 ఉప కులాలకు గాను 9 శాతం రిజర్వేషన్ ఇచ్చినట్టు స్పష్టం చేశారు. మూడో గ్రూపులో 26 ఉపకులాలు ఉంటే.. వారికి ఐదు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామని సీఎం ప్రకటించారు. అలానే 2026 జనాభా లెక్కలు వచ్చిన వెంటనే దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని సీఎం హామీ ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం
March 18, 2025
0
Tags