ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 30వ తేదీన మన మిత్ర పేరుతో వాట్సాప్ సేవలను ప్రారంభించారు. మొత్తం 161 సర్వీసెస్‌ను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇకపై ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వారాలు తరబడి తిరగాల్సిన పనిలేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ సరికొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల నుంచి మంచి స్పందన కూడా లభిస్తోంది. ఏఐ ఆధారిత మన మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ 2.0 వెర్షన్‌ను ఈ జూన్ 30 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ తెలిపారు. టెన్త్, ఇంటర్ విద్యార్థుల కోసం మొబైల్ ద్వారా హాల్‌టికెట్లు అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు పరీక్షా ఫలితాలు కూడా వాట్సాప్ ద్వారానే తెలుసుకోవచ్చని వెల్లడించారు. ఫలితాలను వాట్సప్ గవర్నెన్స్ ద్వారా విద్యార్థుల మొబైల్ నంబర్లకు డైరెక్ట్‌గా పంపిస్తామని లోకేష్ పేర్కొన్నారు. అలాగే ఏఐ ఆధారిత వాయిస్ సేవలతో బస్ టికెట్ కావాలని నోటితో చెబితే టికెట్ బుక్ చేస్తుందని, నంబర్ చెబితే కరంటు బిల్లు కట్టేస్తుందని వెల్లడించారు. ఈ సేవలు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. రాబోయే 30 రోజుల్లో తిరుమల తిరుపతి దేవస్థానాల సేవలు కూడా వాట్సప్ గవర్నెన్స్ ద్వారా అందుబాటులోకి తెస్తామన్నారు. సర్టిఫికెట్లు ఆరు నెలలకోసారి తీసుకోవాల్సిన అవసరం లేకుండా శాశ్వత ధ్రువీకరణ పత్రాలు చెల్లుబాటయ్యేలా త్వరలో చట్టసవరణ చేస్తామని చెప్పారు. మన మిత్ర యాప్ అనేది ఏపీ పౌరుల కోసం తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పు. ప్రజలు ఆఫీసుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా.. నేరుగా 161 సేవలను పొందేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్‌కు శ్రీకారంచుట్టింది. దీంతో పౌరులు తమకు అవసరమైన సేవలను వాట్సప్ ద్వారానే పొందుతున్నారు. మన మిత్ర వాట్సప్ గవర్నెన్స్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగింది. మన మిత్ర వాట్సప్ నంబర్ 9552300009 ద్వారా ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సర్వీసులను అందిస్తోంది. ప్రస్తుతం మన మిత్ర ద్వారా ఏపీఎస్‌ఆర్టీసీ, విద్యుత్తు, దేవాదాయ, పురపాలక, రెవెన్యూ, ఆరోగ్య కార్డులు, పోలీసు శాఖకు సంబంధించిన 161 సేవలు అందుబాటులో ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించి.. వ్యవసాయ ఆదాయ ధ్రువపత్రం, కుటుంబసభ్యుల ధృవపత్రం, అడంగల్, ఆర్వోఆర్, నీటి తీరువా, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, టైటిల్ డీడ్ పాస్ పుస్తకం ప్రింటింగ్, వివాహ ధ్రువపత్రం వంటి సేవలను మన మిత్ర ద్వారా అందిస్తున్నారు.
మొబైల్ నెంబర్‌కే టెన్త్, ఇంటర్ ఫలితాలు !
March 22, 2025
0
Tags