ఉగాది రోజున ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమవుతుంది !

Telugu Lo Computer
0

మాజంలో మార్పు తెచ్చేందుకే పీ-4 విధానం తీసుకొచ్చామని సీఎం చంద్రబాబు అన్నారు. ఉగాది రోజున ఏ కార్యక్రమం తలపెట్టినా విజయవంతమవుతుందని, అందుకే ఈ వినూత్న కార్యక్రమానికి ఇవాళ శ్రీకారం చుట్టామని తెలిపారు. పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ' పీ-4' కార్యక్రమాన్ని ప్రారంభించారు. పబ్లిక్‌, ప్రైవేట్‌, పీపుల్‌, పార్టనర్‌షిప్‌గా ఈ విధానాన్ని తీసుకొచ్చారు. తొలి దశలో దాదాపు 20 లక్షల మందికి లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందించారు. వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ' మార్గదర్శి- బంగారు కుటుంబం' నినాదంతో పీ-4 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మంగళగిరికి చెందిన నరసింహ కుటుంబాన్ని తొలి బంగారు కుటుంబంగా, భవన నిర్మాణ కార్మికుడు ఇమ్మాన్యుయెల్‌ కుటుంబాన్ని రెండో బంగారు కుటుంబంగా ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్‌, నాదెండ్ల మనోహర్‌, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి, డీబీవీ స్వామి, కూటమి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పేదరికం లేని సమాజం కోసమే కృషి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. '' నాకు ఏ కోరికలు లేవు. ప్రజలు, యువత భవిష్యత్తు బాగుండాలని ఆలోచించాను. సుపరిపాలనను, మంచి రాజకీయాలను నమ్మాను. నేను ఏ తప్పూ చేయలేదు.. భవిష్యత్‌లో చేయను. పని చేయడం తప్ప నాకు మరేమీ తెలియదు. 40 ఏళ్లుగా ప్రజలే జీవితంగా జీవించా. నా జీవితం ప్రజలకే అంకితం. పేదల సంక్షేమానికి శ్రీకారం చుట్టిన వ్యక్తి..ఎన్టీఆర్‌. పాతికేళ్ల క్రితం తెచ్చిన ఐటీ వల్ల తెలుగు యువత బాగుపడ్డారు. రైతు కూలీల పిల్లలు ఇవాళ అనేక దేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు. మేం చేసిన అభివృద్ధి వల్ల తెలంగాణలో అత్యధిక తలసరి ఆదాయం వస్తోంది. అమరావతిని గొప్ప నగరంగా తీర్చిదిద్దుతాం. ప్రజలకు ఏయే మంచి పనులు చేయాలనే నేను ప్రతిరోజూ ఆలోచిస్తా. ఇప్పుడు సాయం పొందిన వాళ్లలో అనేకమంది కోటీశ్వరులవుతారు'' అని చంద్రబాబు అన్నారు. 'తెలుగు ప్రజలు బాగుండాలనేదే సీఎం చంద్రబాబు, నా ఆకాంక్ష' అని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైకాపా ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారనే చంద్రబాబుకు మద్దతిచ్చినట్లు చెప్పారు. '' సమర్థ నాయకుడు కాబట్టే చంద్రబాబుకు మద్దతిచ్చాను. ఆయన సీఎం అయ్యాక కార్మికుల జీవితాల్లో మార్పు వచ్చింది. ఎదుగుతున్న క్రమంలో మంచి సలహా ఇచ్చేవారు ఉండాలి. అలా ఇస్తే యువత అద్భుతాలు చేస్తారు. మనమంతా చిన్నచిన్న గ్రామాల నుంచి వచ్చిన వాళ్లమే. చంద్రబాబు సారథ్యంలో మన రాష్ట్రం స్వర్ణాంధ్రగా మారుతుంది. సాధారణ నాయకుడు రాజకీయాలు, ఎన్నికల గురించే ఆలోచిస్తాడు. చంద్రబాబు లాంటి విజనరీ నేత.. వచ్చే తరం గురించి ఆలోచిస్తారు. పీ-4 వల్ల 30 లక్షల కుటుంబాల జీవితాల్లో మార్పులు వస్తాయి. ఎదుగుతున్న క్రమంలో కష్టపడి నేర్చుకున్నవారే అద్భుతాలు చేస్తారు. ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు కాస్త ధైర్యం చెబితే చాలు.. వాళ్లకు కొండంత అండగా ఉంటుంది'' అని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. సమాజానికి సాయం చేసేవాళ్లు చాలా మంది ఉన్నారని మేఘా ఇంజినీరింగ్‌ కంపెనీ అధినేత కృష్ణారెడ్డి అన్నారు. చాలా మంది ధనికులకు ఎలా సేవ చేయాలో తెలియదని, గ్రామాలను దత్తత తీసుకునేందుకు అనేక మంది సిద్ధంగా ఉన్నారని తెలిపారు. '' ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవడం కూడా చాలా మందికి తెలియదు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా కష్టపడి పని చేస్తారని భారతీయులకు పేరుంది. మా కంపెనీల్లో సుమారు 4 లక్షల మంది పని చేస్తున్నారు. భయపడకుండా కష్టపడితే అనేక అవకాశాలు వస్తాయి. పీ-4 ద్వారా కృష్ణా జిల్లా ప్రజలకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నా'' అని కృష్ణారెడ్డి పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)