రాజస్తాన్‌లో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి ఒప్పందం చేసుకుంది. సింగరేణి ప్రస్తుతం 1,200 మెగావాట్ల థర్మల్, 245.5 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి చేస్తోంది. తాజా ఒప్పందంతో మరో 1,600 మెగావాట్ల థర్మల్, 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ అందుబాటులోకి వస్తుంది. పెరుగుతున్న దేశ విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యాపార విస్తరణపై సింగరేణి దృష్టి పెట్టింది. రాజస్తాన్ విద్యుత్ సంస్థతో కలిసి సింగరేణి 74 శాతం, రాజస్తాన్ 26 శాతం పెట్టుబడితో ఒప్పందం చేసుకుంది. లాభాల్లో కూడా ఇవే వాటాలు ఉంటాయి. 136 ఏళ్ల సింగరేణి చరిత్రలో వ్యాపార విస్తరణకు ఇది ఎంతో దోహదం చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం అపార బొగ్గు నిల్వలతో థర్మల్ విద్యుత్‌కు కేంద్రంగా నిలిచింది. ఒప్పందం ప్రకారం 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుతోపాటు 1,500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. పెట్టుబడిలో సింగరేణి 74 శాతం, రాజస్తాన్ విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ 26 శాతం వాటాను చెల్లించనున్నాయి. రాజస్తాన్ ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 26 శాతం సొమ్మును సౌర, థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన స్థలాలు, మౌలిక సదుపాయాల రూపంలో అందించనుంది. సింగరేణి తన వాటాగా అంగీకరించిన 74 శాతాన్ని ధన రూపంలో చెల్లించనుంది. ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అవసరమైన స్థలాన్ని అన్ని రకాల అనుమతులతో సింగరేణికి ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్పగించనుంది. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు కొనుగోలుకు డిస్కంలతో ఒప్పందాలు (పీపీఏ) తదితర అంశాలను రాజస్తాన్ ప్రభుత్వ విద్యుత్ శాఖ ద్వారా చేపట్టేలా అంగీకరించారు.
రాజస్తాన్‌లో విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సింగరేణి ఒప్పందం
March 09, 2025
0
Tags