మహారాష్ట్ర లోని శివసేన (యూబీటీ వర్గం) సీనియర్ నేత సంజయ్ రౌత్ త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని మహారాష్ట్ర మంత్రి నితీశ్ రాణే సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకోసం ఢిల్లీలోని ఓ నాయకుడితో సంప్రదింపులు జరుపుతున్నారని మంత్రి ఆరోపించారు. సంజయ్ రౌత్ రాజ్యసభ పదవీకాలం త్వరలోనే ముగుస్తుందని.. ఆయన రెండో సారి విజయం సాధించేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీకి సరిపడా ఎమ్మెల్యేలు లేరని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) 20 స్థానాలు మాత్రమే దక్కించుకోగలిగిందని, ఆ పార్టీ భవిష్యత్తును అర్థం చేసుకున్న సంజయ్ రౌత్ కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతున్నారని నితీష్ రాణే పేర్కొన్నారు. సంజయ్ రౌత్ శివసేన పార్టీలో ఎంతకాం ఉంటారో సామ్నా పత్రికలో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. ఢిల్లీలో మంతనాలు జరుపుతున్న అగ్రనేతల వివరాలు కూడా వెల్లడించాలన్నారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రి, శివసేన నాయకుడు ఏక్‌నాథ్ షిండే మధ్య విభేదాలు రాష్ట్రంలో పాలనను ప్రభావితం చేస్తున్నాయని రౌత్ ఆరోపిస్తున్న సమయంలో రాణే వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. నవంబర్ 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తనను తిరిగి ముఖ్యమంత్రిగా నియమించలేదనే వాస్తవాన్ని షిండే ఇంకా అంగీకరించలేదని, తిరిగి ముఖ్యమంత్రి పదవిని పొందడానికి ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సంజయ్ రౌత్ పేర్కొన్నారు. ఈ విషయం ఫడ్నవీస్ కు బాగా తెలుసన్నారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన మంత్రి నితీష్ రాణే ఆ ఆరోపణలను ఖండించడంతో పాటు సంజయ్ రౌత్ పై తీవ్ర విమర్శలు గుప్పించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మిత్రపక్షాలుగా ఉన్న సంగతి తెలిసిందే.
సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు : మంత్రి నితీశ్ రాణే
February 02, 2025
0
Tags