తిరుపతి జనసేన నేత కిరణ్ రాయల్ చేతిలో మోసపోయానని వీడియో పెట్టిన లక్ష్మీరెడ్డి తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో మాట్లాడుతూ కిరణ్ రాయల్ మాయమాటలతో తాను సర్వస్వం కోల్పోయానని, ఆయన అవసరాలకు తన నుంచి తీసుకున్న రూ.1.20 కోట్లు, 25 సవర్ల బంగారాన్ని మాత్రమే తాను తిరిగి అడుగుతున్నానని అన్నారు. తనలాగే కిరణ్ రాయల్ చేతిలో మోసపోయిన బాధితులు చాలామంది ఉన్నారని ఆమె ఆరోపించారు. తనకు ఏ పార్టీ మద్దతు లేదని, కిలాడీ లేడీ అంటూ తనపై అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. తనకు ఎమ్మెల్యే సీటు ఇస్తారని, పార్టీ అధికారంలోకి వస్తే రెట్టింపు డబ్బులు ఇస్తానని, పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడన్నారు. పిల్లల భవిష్యత్తు, తానిచ్చిన డబ్బులు తిరిగి రాబట్టుకోవడం కోసమే ఈ పోరాటం చేస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌లు అండగా నిలిచి న్యాయం చేయాలన్నారు. అంతకుముందు ఎస్పీ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కిరణ్ రాయల్‌పై ఆమె ఫిర్యాదు చేశారు. లక్ష్మీరెడ్డిని జైపూర్ పోలీసులు అరెస్టు చేసి ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఎస్వీయూ సీఐ రామయ్య వివరాల మేరకు.. రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఆన్‌లైన్ ఛీటింగ్‌లో నిందితురాలిగా లక్ష్మీరెడ్డి ఉంది. ఆమె బ్యాంకు ఖాతాలకు ఇతరుల ఖాతాల నుంచి నగదు జమ చేసుకుని.. ఆ డబ్బుతో క్రిప్టో కరెన్సీ (బిట్ కాయిన్స్) కొనుగోలు చేసి వారికి అందించినట్లు అభియోగాలున్నాయి. 2021లో జైపూర్ జిల్లా ఛాంద్వాజీ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్టు చేయగా లక్ష్మీరెడ్డి పరారీలో ఉన్నట్లు భావించి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల కిరణ్ రాయల్‌తో ఏర్పడిన విభేదాలతో ఆమె సమాచారం తెలిసి ఇంటిలిజెన్స్ విభాగం ఇచ్చిన సమాచారం మేరకు జైపూర్ పోలీసులు ఇక్కడికి వచ్చారు. రుయాలో వైద్య పరీక్షలు చేయించి మొదటి అదనపు మున్సిబ్ న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు అనుమతితో జైపూర్‌కు తరలించే క్రమంలో అస్వస్థతకు గురైన ఆమెను మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. లక్ష్మీరెడ్డి ఆరోపణలపై కిరణ్ రాయల్ తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. వైకాపా నేతలు భూమన కరుణాకర్‌రెడ్డి, అభినయ్‌రెడ్డిలే లక్ష్మీరెడ్డిని ప్రలోభాలకు గురిచేసి ఈ ఆరోపణలు చేయిస్తున్నారని, ఆమె తరఫు న్యాయవాదులు సైతం ఆ పార్టీకి చెందిన వారేనని విమర్శించారు. ఆమెకు తాను ఎటువంటి బాకీ లేనని వెల్లడించారు. ఆమెపై ఆరు కేసులున్నాయన్నారు.
కిరణ్ రాయల్ మాయమాటలు నమ్మి సర్వస్వం కోల్పోయా !
February 11, 2025
0
Tags