భూమి వైపు దూసుకొస్తున్న ఆస్టరాయిడ్‌ 2024 YR4

Telugu Lo Computer
0


భూమి దిశగా వంద మీటర్ల వెడల్పుతో ఉన్న ఓ భారీ గ్రహశకలం 'ఆస్టరాయిడ్‌ 2024 YR4' వస్తోంది. 2032 డిసెంబర్‌లో భూమికి చాలా దగ్గరగా వచ్చే ప్రమాదం ఉందని ఖగోళ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. చైనా వంటి దేశాలు ఇప్పటికే ఈ ముప్పును తప్పించడానికి ఉన్న మార్గాలను అన్వేషించడం మొదలు పెట్టాయి. ఆస్టరాయిడ్‌ 2024 YR4ను ఈ ఏడాది ఆరంభంలోనే గుర్తించారు. దీన్ని నియర్‌ ఎర్త్‌ ఆబ్జెక్ట్‌గా వర్గీకరించారు. తొలుత ఇది భూమిని ఢీకొట్టడానికి 1.3 శాతం అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. తర్వాత దాన్ని 2.3 శాతానికి పెంచడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఖగోళ శాస్త్రవేత్తలంతా అప్రమత్తమయ్యారు. గంటకు 38,000 కిలోమీటర్ల వేగంతో వస్తోన్న ఆ సెలెస్టియల్‌ ఆబ్జెక్ట్‌ భూమిని ఢీకొంటే దాదాపు 80 లక్షల టన్నుల TNTతో సమానమైన శక్తి విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రపంచ యుద్ధాల సమయంలో హిరోషిమా, నాగసాకిపై వేసిన అణుబాంబులతో వెలువడిన శక్తితో పోలిస్తే ఇది 500 రెట్లు అధికం కావడం గమనార్హం. ఒకవేళ ఆ ఆస్టరాయిడ్‌ భూవాతావరణంలోకి ప్రవేశిస్తే మిడ్‌ ఎయిర్‌ ఎక్స్‌ప్లోజన్‌ సంభవించి 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సర్వం బూడిద అయిపోతుంది. ఫలితంగా ఏర్పడే షాక్‌వేవ్స్‌, వేడి, డెబ్రిస్‌ పెద్ద వినాశనాన్నే మిగిలిస్తాయి. కొన్ని నగరాలనే తుడిచిపెట్టేస్తాయి. పర్యావరణపరంగానూ తీవ్ర ముప్పు తప్పదు. సముద్రంలో పడితే సునామీలు తప్పవు. ఒకవేళ భూమిపై పడితే క్లైమేట్‌ను పూర్తిగా ప్రభావితం చేసే డస్ట్‌ క్లౌడ్స్‌ ఏర్పడతాయి. దీన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు చైనా చర్యలు చేపట్టింది. కొందరు స్పేస్‌ ఇంజినీర్లు, సైంటిస్ట్‌లను ఆ పనిలో పురమాయించింది. ఆస్టరాయిడ్‌ దిశను మార్చి భూమికి ఉన్న ముప్పును తప్పించే టెక్నాలజీని డెవలప్‌ చేయడం వారి పని. దీనిపై ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. కానీ కైనెటిక్‌ ఇంపాక్టర్స్‌, గ్రావిటీ ట్రాక్టర్స్‌, న్యూక్లియార్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ వంటి మార్గాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. నాసా, యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ సైతం ఈ ఆస్టరాయిడ్‌ను చాలా క్లోజ్‌గా పర్యవేక్షిస్తున్నాయి. నాసా ఇప్పటికే ఈ తరహా ముప్పును ఎదుర్కొనేందుకు 'డబుల్‌ ఆస్టరాయిడ్‌ రీడైరెక్షన్‌ టెస్ట్‌' అనే ప్రయోగాన్ని చేపట్టి సక్సెస్‌ అయ్యింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు టెక్నాలజీని డెవలప్‌ చేసే అవకాశం ఉంది. ఆస్టరాయిడ్‌ 2024 YR4 భూమిని ఢీకొట్టే అవకాశాలు తక్కువగానే ఉన్నాయి. అలా అని నిర్లక్ష్యం చేసే పరిస్థితి కూడా లేదు. అందుకే దాన్ని ఖగోళ శాస్త్రవేత్తలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నారు. టెలిస్కోపులు, స్పేస్‌ అబ్జర్వేటరీల ద్వారా దాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్‌ చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ సిమ్యులేషన్స్‌ ద్వారా దాని దిశను అంచనా వేస్తున్నారు. ఒకవేళ భూమిపైకి వస్తే ఎక్కడ ఢీకొనే అవకాశం ఉందో కాలిక్యులేషన్స్‌ వేస్తున్నారు. ఏదేమైనా ఓ భారీ విపత్తును ఎదుర్కొనేందుకు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. కాస్మిక్‌ థ్రెట్స్‌ నుంచి మానవాళి తమని తాము రక్షించుకునే సామర్థ్యానికి 2032లో భూమికి దగ్గరగా రానున్న ఆస్టరాయిడ్‌ 2024 YR4 పరీక్ష పెట్టనుంది. సైంటిస్టులు నింతరం దాన్ని ట్రాక్‌ చేస్తూ ముప్పును అంచనా వేస్తుంటే.. ఇంజినీర్లు దాన్ని తప్పించేందుకు ఉన్న మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో ఏం జరగనుందో అని యావత్తు ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. 


Post a Comment

0Comments

Post a Comment (0)