ఆంధ్రప్రదేశ్ ని 2047 నాటికి 2.4ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం రూ.2.68లక్షలుగా ఉన్న తలసరి ఆదాయం అప్పటికి రూ.58.14లక్షలు అవుతుందని తెలిపారు. సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర వృద్ధిరేటుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో అమరావతిని భ్రష్టుపట్టించారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గత ఐదేళ్లలో ఎవరికీ స్వేచ్ఛ లేకుండా చేశారని, పారిశ్రామికవేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయేలా చేశారని చంద్రబాబు విమర్శించారు. ''ఆంధ్రప్రదేశ్‌కు పోలవరం జీవనాడి. గత ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారు. సంపద సృష్టిస్తాం - ప్రజల ఆదాయం పెంచుతాం. అభివృద్ధి వల్ల సంపద వచ్చి ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పథకాల ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చు. మౌలిక సౌకర్యాల కల్పనలో సంస్కరణలు తీసుకువచ్చా. పవర్ సెక్టార్‌లో సంస్కరణల ద్వారా రాష్ట్రానికి వెలుగులు తెచ్చాం ఓపెన్ స్కై పాలసీ ద్వారా దుబాయ్-హైదరాబాద్ విమాన సర్వీసు ప్రవేశపెట్టాం. హైదరాబాద్‌లో తొలి గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయానికి శ్రీకారం చుట్టాం. 163 కి.మీ మేర ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం చేపట్టాం. అందుకే తెలంగాణకు హైదరాబాద్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తోంది. స్వర్ణాంధ్రప్రదేశ్, విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇంటిని జియో ట్యాగ్ చేసి కుటుంబ సభ్యులను అనుసంధానం చేస్తున్నాం. నేషనల్ పేమెంట్ గేట్‌వే ద్వారా ఎన్‌పీ ఖాతాలు తీసుకుంటున్నాం. విపత్తు సమయాల్లో పరిహారం అందించేందుకు బాధితుల ఇళ్లు, బ్యాంకు ఖాతాల విషయంలో ఇబ్బందులు తలెత్తాయి. ఇంటికి జియో ట్యాగ్, ఎన్‌పీ ఖాతాతో ఇబ్బందులు అధిగమించవచ్చు. ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలి. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ ధ్యేయంతో ముందుకెళ్తున్నాం. గతంలో నేను చెప్పింది, ఇప్పుడు జరిగేది ప్రజలకు వివరించాం. ప్రజలను భాగస్వాములను చేసుకుని ముందుకెళ్తున్నాం. విజన్ డాక్యుమెంట్‌కు దేశంలో తొలిసారి 16లక్షల వ్యూస్ ఇచ్చారు. వికసిత్ భారత్‌కు కూడా ఈ స్థాయిలో స్పందన రాలేదు. ఆన్‌లైన్‌లో వచ్చిన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నాం. పది సూత్రాలతో మళ్లీ విజన్ రూపొందించాం. 2047 నాటికి 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారడం లక్ష్యం. 2047 నాటికి 42 వేల డాలర్ల తలసరి ఆదాయం లక్ష్యం. ఆర్థిక అసమానతలు తగ్గించడానికి నిరంతరం శ్రమించాలి. పేదలను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి కార్యక్రమం చేపట్టాలి. ధనికులు తమ శక్తి సామర్థ్యాల మేరకు కార్యక్రమాలు చేపట్టాలి. ఇప్పటికే సంపద సృష్టిలో పీ-3(పబ్లిక్-ప్రైవేట్- పార్టనర్‌షిప్) గేమ్‌ఛేంజర్‌గా నిలిచింది. అందుకే పీ-4 విధానం తీసుకొచ్చాం. ప్రజలను ఆర్థికంగా పైకి తేవడానికి పీ-4 విధానం (పబ్లిక్-ప్రైవేట్- పీపుల్- పార్టనర్‌షిప్) గేమ్ ఛేంజర్ కానుంది.గతేడాదితో పోలిస్తే ఈసారి 4.03 శాతం వృద్ధి సాధించాం. ఈసారి వృద్ధిరేటు 12.94శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. రాష్ట్ర వనరులు, ఎఫ్‌ఆర్‌బీఎం ద్వారా రూ.3.23లక్షల కోట్లు ఖర్చు పెట్టొచ్చు. 15శాతం వృద్ధితో వచ్చే ఏడాదికి జీఎస్‌డీపీ 18.47లక్షల కోట్లుగా ఉంటుంది. రూ.64,600 కోట్ల ఎఫ్‌ఆర్‌బీఎంకు అవకాశం వస్తుంది. దీని వల్ల రాష్ట్రానికి రూ.1,20,056 కోట్ల ఆదాయం వస్తుంది. ఇదే విధంగా వృద్ధి సాధిస్తే ఏడాదికి అదనంగా రూ.20,645 కోట్లు వస్తుంది'' అని చంద్రబాబు వివరించారు.