అధిక సుంకాల విషయంలో భారత్‌నూ వదలబోము : డొనాల్డ్‌ ట్రంప్‌

Telugu Lo Computer
0


అమెరికాకు నష్టం కలిగించే అన్ని దేశాలపైనా అధిక సుంకాలు విధిస్తామని, ఈ విషయంలో భారత్‌నూ వదలబోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్పష్టం చేశారు. భారత్, చైనా, బ్రెజిల్‌లూ అధిక సుంకాలను విధిస్తున్నాయని గుర్తు చేశారు. విదేశాలపై సుంకాలను విధించడం ద్వారా అమెరికన్లపై పన్ను భారం తగ్గించే దిశగా చర్యలు చేపడతామని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని నరేంద్ర మోడీ  వస్తున్నారని తెలిపారు. అక్రమ వలసదారులపై ఆయన సరైన చర్యలు తీసుకుంటారని, ఈ విషయంలో భారత్‌తో చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. సోమవారం ఫ్లోరిడా నుంచి వాషింగ్టన్‌కు వస్తూ విమానంలో మీడియాతోనూ, అంతకు ముందు రిపబ్లికన్‌ ప్రతినిధుల రిట్రీట్‌లోనూ ఆయన మాట్లాడారు. 'అమెరికాకు వాస్తవంగా నష్టం కలిగించే బయటి దేశాలపై, ప్రజలపై సుంకాలను విధించబోతున్నాం. ఈ విషయంలో మేమూ ఇతరుల్లాగే వ్యవహరిస్తాం. చైనా అతి పెద్ద సుంకాల విధింపుదారు. భారత్, బ్రెజిల్‌తోపాటు చాలా దేశాలు అదే కోవలోకి వస్తాయి. అందుకే వాటిని వదలాలనుకోవడం లేదు. అమెరికా ఫస్ట్‌ అనేదే మా నినాదం' అని ట్రంప్‌ పేర్కొన్నారు. 'అమెరికన్‌ వ్యాపార సంస్థలపైనా, అమెరికన్లపైనా పన్నులు తగ్గుతాయి. భారీ స్థాయిలో పరిశ్రమలు నెలకొల్పి విస్తృతంగా ఉద్యోగాలు కల్పిస్తాం' అని ట్రంప్‌ పేర్కొన్నారు. 'అమెరికా ధనాగారానికి ధనరాశులు వచ్చి చేరే న్యాయమైన ఆర్థిక వ్యవస్థను స్థాపించబోతున్నాం స్వదేశీయులపై పన్నులు వేసి విదేశాలకు లాభం కలిగించడానికి బదులుగా విదేశాలపై సుంకం విధించి మన పౌరుల్ని ధనికుల్ని చేస్తాం' అని తెలిపారు. ఇందులో భాగంగా తమ దేశ పౌరులకు ఆదాయపు పన్ను నుంచి విముక్తి కలిగించే ప్రతిపాదన చేశారు. తద్వారా ప్రజలు స్వేచ్ఛగా ఖర్చు చేసి ఆర్థిక వ్యవస్థలోకి నిధుల ప్రవాహాన్ని పెంచే దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికా ప్రభుత్వానికి ఆదాయ పన్ను రూపేణా పెద్ద మొత్తంలో ఆదాయం సమకూరుతోంది. ట్రంప్‌ నిర్ణయంతో ఆ మేరకు లోటు ఏర్పడితే.. దానిని భర్తీ చేసుకునేందుకు దిగుమతి సుంకాలను పెంచబోతున్నారు. 'అమెరికన్లను ధనవంతులు, మరింత శక్తిమంతులుగా చేసే వ్యవస్థలోకి మనం వెళుతున్నాం. ఇందులో భాగంగానే ఎక్స్‌టర్నల్‌ రెవెన్యూ సర్వీసును ప్రారంభించా' అని రిపబ్లికన్‌ సభ్యుల సమావేశంలో ట్రంప్‌ అన్నారు. 'అక్రమ వలసదారుల విషయంలో ఏది సరైనదో భారత ప్రధాని మోడీ అది చేస్తారు. ఆయనతో సోమవారం ఉదయం నేను ఫోన్‌లో సుదీర్ఘంగా మాట్లాడా. అన్ని విషయాలూ చర్చకు వచ్చాయి. ఆయన వచ్చే నెలలో శ్వేతసౌధానికి రానున్నారు. భారత్‌తో మాకు మంచి సంబంధాలున్నాయి' అని ట్రంప్‌ చెప్పారు. ట్రంప్‌తో మోదీ ఫలవంతమైన చర్చలు జరిపారని, ప్రాంతీయ అంశాలతోపాటు ఇండో ఫసిఫిక్‌లో భద్రత, పశ్చిమాసియా, ఐరోపా వ్యవహారాలపై వారు చర్చించారని ఒక ప్రకటనలో శ్వేతసౌధం వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)