వచ్చే వారం ఐపీఓల సందడి !

Telugu Lo Computer
0


వచ్చే వారం రోజుల్లో ప్రైమరీ మార్కెట్‌లో మళ్లీ సందడి నెలకొననుంది. మొత్తం మూడు కంపెనీలు ఐపీఓకి రానున్నాయి. బ్లాక్‌స్టోన్‌ మద్దతున్న ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఆరోగ్య సంరక్షణ కంపెనీ ఇండెజీన్‌, ట్రావెల్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థ టీబీఓ టెక్‌ పబ్లిక్‌ ఇష్యూకు వస్తున్నాయి. 2004 నుంచి మొదలుకొని గత నాలుగు సాధారణ ఎన్నికల సమయంలో మే నెలలో ఒక్క ఐపీఓ కూడా రాలేదు. ఎన్నికల హడావుడి వల్ల ఏప్రిల్‌ - జూన్‌లో పబ్లిక్‌ ఇష్యూలు చాలా తక్కువగా ఉండేవి. ఈసారి మాత్రం ట్రెండ్‌ మారింది. వచ్చేవారం మూడు మెయిన్‌బోర్డు ఐపీఓలు రూ.6,400 కోట్ల సమీకరణకు సిద్ధమవడం విశేషం. భారత క్యాపిటల్‌ మార్కెట్లు, దేశ దీర్ఘకాల వృద్ధిపై పెరుగుతున్న విశ్వాసానికి ఇది నిదర్శనమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉన్న ఇండెజీన్‌ ఐపీఓ మే 6న ప్రారంభమై 8 వరకు కొనసాగనుంది. ధరల శ్రేణిని రూ.430-452గా నిర్ణయించింది. మొత్తం రూ.1,842 కోట్లు సమీకరించనుంది. రూ.760 కోట్లు తాజా షేర్ల జారీ ద్వారా, రూ.1,082 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా పొందనుంది. మదుపర్లు కనీసం రూ.14,916తో (గరిష్ఠ ధర వద్ద) 33 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి. సమీకరించిన నిధులను రుణ చెల్లింపులు, మూలధన వ్యయాలు, కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనుంది. ఆధార్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ రూ.3,000 కోట్లు సమీకరించనుంది. ఈ ఐపీఓ మే 8న ప్రారంభమై 10న ముగియనుంది. షేరు ధరల శ్రేణిని రూ.300-315గా నిర్ణయించింది. పబ్లిక్‌ ఇష్యూలో సమీకరించిన నిధులను భవిష్యత్‌ మూలధన వ్యయాలతో పాటు కొంత సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వినియోగించనున్నట్లు కంపెనీ తెలిపింది. మొత్తం సమీకరణలో రూ.1,000 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా.. మరో రూ.2,000 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ ద్వారా పొందనుంది. రిటైల్‌ మదుపర్లు కనీసం రూ.14,805తో (గరిష్ఠ ధర వద్ద) 47 షేర్లకు బిడ్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. టీబీఓ టెక్‌ ఐపీఓ ద్వారా రూ.1,550 కోట్లు సమీకరించేందుకు సిద్ధమైంది. దీంట్లో రూ.400 కోట్లు కొత్త షేర్ల జారీ ద్వారా కాగా.. మరో రూ.1,151 కోట్లు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద సమీకరిస్తోంది. ధరల శ్రేణిని కంపెనీ రూ.875-920గా నిర్ణయించింది. మదుపర్లు కనీసం రూ.14,720తో (గరిష్ఠ ధర వద్ద) 16 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలి. సమీకరించిన నిధులను ప్లాట్‌ఫామ్‌ను మరింత బలోపేతం చేయడానికి, కొనుగోళ్లు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించనుంది. ఈ పబ్లిక్‌ ఇష్యూ మే 8న ప్రారంభమై 10న ముగియనుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)