ఏప్రిల్ 5న సిరిసిల్లలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరుష పదాలతో చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. పార్టీ అధినేతగా, గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని, అందుకు తగిన ప్రాథమిక ఆధారాలను కమిషన్ పరిశీలించిందని ఈసీ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నోటీసుకు గురువారం ఉదయం 11 గంటలకల్లా కమిషన్‌కు చేరేలా వివరణ ఇవ్వాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితో పాటు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి వాస్తవాలతో కూడిన రిపోర్టును తెప్పించుకున్న తర్వాత ఈ నోటీసు జారీ చేయాల్సి వచ్చిందని అవినాశ్ కుమార్ పేర్కొన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ నుంచి ఈ నెల 6న ఫిర్యాదు వచ్చిందని, అందులో సిరిసిల్లలో కేసీఆర్ చేసిన పరుష వ్యాఖ్యలను ప్రస్తావించారని, దీనిమీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఈ నెల 9న లేఖ రాశామని, ఆయన నుంచి 10వ తేదీన వివరణ వచ్చిందని అవినాశ్ కుమార్ ప్రస్తావించారు. దీనికి తోడు సిరిసిల్ల జిల్లా ఎలక్షన్ ఆఫీసర్ నుంచి కూడా ఈ నెల 10న వచ్చిన రిప్లైలో కేసీఆర్ ఈ నెల 5న సిరిసిల్లలో చేసిన కామెంట్లకు సంబంధించి కొన్ని వాస్తవాలను ఉదహరించారని ఈ నోటీసులో పేర్కొన్నారు.
కేసీఆర్‌కు కేంద్ర ఎలక్షన్ కమిషన్ నోటీసులు జారీ !
April 17, 2024
0
Tags