జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ ఖతార్ రాజధాని దోహాకు వెళ్లారు. అయితే, ఆ సమయంలో విమానం వద్ద ఆయన్ను ఆహ్వానించేందుకు ఖతార్ అధికారులు ఎవరూ లేరని మీడియా కథనాలు వెలువడ్డాయి. దాంతో వాల్టర్ విమానం డోర్ వద్దే ఆగిపోయారు. అర్ధగంట పాటు చేతులుకట్టుకొని అక్కడే నిల్చుండిపోయారు. అయితే అప్పటికే అక్కడ ఖతార్‌లోని జర్మనీ దౌత్యవేత్తతో పాటు గౌరవ వందనం ఇవ్వడానికి సిబ్బంది సిద్ధంగానే ఉన్నప్పటికీ ఈ పరిస్థితి ఎదురైంది. ఖతార్ విదేశాంగ శాఖకు చెందిన మంత్రి ఒకరు వచ్చే వరకు జర్మనీ అధినేత ముందడుగు వేయలేదు. దీని తర్వాత కూడా అనుకున్న సమయానికే వాల్టర్ ఖతార్ పాలకుడు షేక్ తమీమ్ బిన్ హమాద్ అల్ థనీతో భేటీ అయ్యారు. కేవలం మూడుగంటల పాటు జరిగిన ఈ పర్యటనలో ఆయన హమాస్ చెరలో ఉన్న జర్మనీ పౌరుల విడుదల గురించి ప్రధానంగా చర్చించారు. 'వారి విడుదలకు ఖతార్ తనవంతు కృషి చేస్తుందని అనుకుంటున్నాను. క్లిష్టమైన చర్చల సమయంలో ఎవరూ హామీలు ఇవ్వలేరు' అని భేటీ అనంతరం మీడియాతో అన్నారు. అక్టోబర్ 7వ తేదీన హమాస్ ఇజ్రాయెల్‌పై దాడిజరిపి 240 మందిని బందీలుగా తీసుకెళ్లింది. వారిలో ఇజ్రాయెల్ వాసులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. గాజాలో ఇజ్రాయెల్ కాల్పులు విరమణ, బందీల విడుదలకు ఖతార్ రెండు వర్గాల మధ్యవర్తిత్వం చేస్తోంది. ఈ క్రమంలో తమ దేశీయులు విడిపించుకునేందుకు బుధవారం వాల్టర్ ఖతార్ వచ్చారు. అయితే, ప్రస్తుత పరిణామం షెడ్యూల్ లోపం వల్లా..? లేక ఉద్దేశపూర్వకమా..? అనేది స్పష్టత లేదు.
అర గంట సేపు విమానం డోర్ వద్దే నిల్చున్న జర్మనీ అధ్యక్షుడు !
December 01, 2023
0
Tags