తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజు కావడంతో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ హైదరాబాద్‌లో సుడిగాలి పర్యటన చేపట్టారు. ఈ సాయంత్రం ప్రచారానికి తెర పడేలోగా ఆయన మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్ షోలను నిర్వహించాల్సి ఉంది. ఇందులో మొదటిది- జూబ్లీహిల్స్ నియోజకవర్గం. ఇక్కడ టీమిండియా మాజీ కేప్టెన్ అజరుద్దీన్.. కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్నారు. ఈ ఉదయం 10 గంటలకు జూబ్లీహిల్స్‌లో రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అజరుద్దీన్‌తో కలిసి తొలుత ఆటో డ్రైవర్లు, చిరుద్యోగులు, పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖిగా సమావేశం అయ్యారు. ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ఉద్యోగులను కలుసుకున్నారు. వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. తమ ఉద్యోగాలకు ఎలాంటి భరోసా ఉండట్లేదని, విధి నిర్వహణలో భాగంగా ఒకరోజులో కనీసం 12 నుంచి 14 గంటల పాటు తాము రోడ్ల మీదే ఉండాల్సి వస్తోందని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ ఉద్యోగులు వాపోయారు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని ఉందని, తమ సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని రాహుల్ గాంధీకి విజ్ఞప్తి చేశారు. తమకు వస్తోన్న జీతం ఏ మాత్రం చాలట్లేదని పారిశుద్ధ్య కార్మికులు చెప్పారు. తనకు ప్రతినెలా 13,000 నుంచి 14,000 రూపాయల వరకు వేతనం అందుతోందని, చాలీచాలని ఈ జీతంతో కుటుంబ పోషణ కష్టమైందంటూ ఓ మహిళా పారిశుద్ధ్య కార్మికురాలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడారు. తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే చిరుద్యోగుల కోసం ఖచ్చితంగా మంచి నిర్ణయాలను తీసుకుంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి లేదా మంత్రులతో ప్రత్యేకంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి, అందులో నుంచి వచ్చే సూచనలతో సంక్షేమ పథకాలను రూపొందిస్తామని భరోసా ఇచ్చారు.
చిరుద్యోగులకు రాహుల్ గాంధీ హామీ !
November 28, 2023
0
Tags