తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో విడుదల చేయాల్సిన రైతు బంధు నిధుల్ని లబ్దిదారులకు ఇచ్చేందుకు ఈసీని బీఆర్ఎస్ సర్కార్ అనుమతి కోరడం, వెంటనే లభించడంపై కాంగ్రెస్ ఇవాళ మండిపడింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ మీడియాతో చేసిన చిట్ చాట్ లో ఈసీ నిర్ణయం వెనుక బీజేపీ-బీఆర్ఎస్ స్నేహం ఉందని ఆరోపించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్కటే అని మరోసారి రుజువైందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. రైతుబంధు కు ఈసీ అనుమతి ఇవ్వడం చూస్తే అర్థం చేసుకోవాలన్నారు. రైతుబంధు డబ్బులు పడ్డాయని రైతులు ప్రభావితం కావొద్దని రేవంత్ సూచించారు. తాము అధికారంలోకి వస్తే 5వేలు ఎక్కువ వచ్చేవని రేవంత్ గుర్తుచేశారు. కేసీఆర్ ఏది ఇచ్చినా తీసుకోవాలని, మిగతావి కాంగ్రెస్ ఇస్తుందని రేవంత్ ఓటర్లకు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తమ పార్టీ అభ్యర్దులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వివేక్ పై ఐటీ ఈడీ దాడులు కూడా బీజేపీ-బీఆర్ఎస్ స్నేహం వల్లే జరుగుతున్నాయని రేవంత్ ఆరోపించారు. గోయల్ ఇంట్లో 300 కోట్ల డబ్బు ఉన్నా చర్యలు తీసుకోలేదని, కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారని ఆయన విమర్శించారు. కేసీఆర్ పై చర్యలు తీసుకుంటామని చెబుతున్న బీజేపీ పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉండి ఏం చేసిందని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీలో ఉంటే వివేక్ మంచిబాలుడు, కాంగ్రెస్ లో ఉంటే రావణాసురుడు అన్నట్లుగా చిత్రీకరిస్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ పైన బీజేపీ చర్యలు తీసుకోవట్లేదనే వివేక్ బయటికి వచ్చాడన్నారు. ఎన్నికల ఫిర్యాదులు చేసేందుకు ప్రయత్నిస్తే సీఈవో తమ ఫోన్లు కూడా ఎత్తడం లేదని రేవంత్ ఆరోపించారు. ప్రజల సొమ్ముతో ఓట్లు కొంటారా అని రైతుబంధు నిధుల విడుదలపై రేవంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
తెలంగాణలో రైతుబంధుకు ఈసీ అనుమతి వెనుక బీజేపీ ?
November 25, 2023
0
Tags