మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్‌కు సంబంధించి కూడా ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దీన్ని ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సహ వ్యవస్థాపకుడు మార్క్ రాండోల్ఫ్ వెల్లడించారు. బిల్‌గేట్స్ చాలా కాలం పాటు విమానంలో సామాన్యులు ప్రయాణించే ఎకానమీ క్లాస్‌లోనే వెళ్లేవారని మార్క్ వెల్లడించారు. బిజినెస్ క్లాస్ టికెట్‌కొనే స్తోమత ఆయనకు ఉన్నప్పటికీ దానికి చెల్లించే డబ్బులక పొందే సేవ, సదుపాయాలకు పొంతన ఉండేది కాదని గేట్స్ అభిప్రాయం! ఎకానమీ క్లాస్‌తో పోలిస్తే తొమ్మిది రెట్లు అధికంగా చెల్లిస్తున్నప్పటికీ.. సదుపాయాలు మాత్రం ఆ స్థాయిలో ఉండేవి కాదని ఆయన భావించేవారట. పైగా ఏ క్లాస్‌లో ప్రయాణించినా.. చివరకు అందరూ ఒకే సమయానికి, ఒకే గమ్యస్థానానికి వెళ్తున్నప్పుడు అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏముందని అనేవారట. ఈ విషయాన్ని మార్క్ 'ఎక్స్ (ట్విటర్)'లో పోస్ట్ చేశారు. విమానంలో బిల్ గేట్స్ ఎకానమీ క్లాస్‌లో కూర్చొని ల్యాప్‌టాప్‌లో పనిచేసుకుంటున్న ఓ పాత ఫొటోను కూడా జత చేశారు. మరోవైపు తన గురించి కూడా ఈ సందర్భంగా మార్క్ ఓ విషయాన్ని పంచుకున్నారు. విలాసవంతమైన కారును కొనుక్కునే స్తోమత తనకు ఉన్నప్పటికీ వోల్వో స్టేషన్ వ్యాగన్‌నే వాడుతున్నానని వెల్లడించారు. తన అవసరాలు దీనితోనే తీరిపోతున్నప్పుడు ఖరీదైన కార్ల గురించి ఆలోచించాల్సిన అవసరం రాలేదన్నారు. అలాగే 35 డాలర్ల వైన్‌తో వచ్చే ఆనందం వెయ్యి డాలర్ల వైన్‌తో వచ్చే సంతోషం ఒకటే అయినప్పుడు ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం లేదని తాను భావిస్తానన్నారు. అయితే, అలాంటప్పుడు సంపద ఎందుకు అనే ప్రశ్న తలెత్తే అవకాశం ఉందన్నారు. డబ్బు భద్రతతో పాటు స్వేచ్ఛనిస్తుందన్నారు. తగినంత సంపద మన దగ్గర ఉన్నప్పుడే అందుబాటులో ఉన్న సదుపాయాల నుంచి ఎంపిక చేసుకునే సౌకర్యం కూడా లభిస్తుందన్నారు. అలాగే డబ్బుతో కనీస అవసరాలు తీరాక, అదనపు సంపద కోసం పెద్దగా సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం ఉండదన్నారు. తద్వారా మిగిలిన సమయాన్ని నచ్చిన విధంగా ఉపయోగించుకోవచ్చని వివరించారు. ఆ స్వేచ్ఛ సంపద వల్లే వస్తుందని తెలిపారు. సమయాన్ని నచ్చినట్లుగా గడపడం కంటే ఆనందం ఏముంటుందని వ్యాఖ్యానించారు. తన అనుభవంలో డబ్బు గురించి తెలుసుకున్న అతి ముఖ్యమైన విషయం ఇదేనన్నారు.
సమయాన్ని నచ్చినట్లుగా గడపడం కంటే ఆనందం ఏముంటుంది ?
October 25, 2023
0
Tags