స్పీకర్‌ మెకార్థీ చొరవతో తొలగిన షట్‌డౌన్‌ ముప్పు !

Telugu Lo Computer
0


మెరికా ఫెడరల్‌ ప్రభుత్వానికి ఎదురైన షట్‌డౌన్‌ ముప్పు చివరి క్షణాల్లో తాత్కాలికంగా తొలగిపోయింది. 45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఇబ్బందిలేకుండా చేసే స్వల్పకాల బిల్లులకు విపక్ష రిపబ్లికన్ల ఆధిక్యం ఉన్న ప్రతినిధుల సభ శనివారం మధ్యాహ్నం ఆమోదం తెలిపింది. విపక్ష సభ్యులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉక్రెయిన్‌కు నిధుల పద్దును ఇందులో చేర్చలేదు. శనివారం రాత్రి 12 గంటల్లోపు ఈ బిల్లులు పాసైతేనే అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రభుత్వం కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమయ్యే అక్టోబరు 1 నుంచి తమ సిబ్బందికి వేతనాలను, వివిధ ప్రభుత్వ విభాగాలకు, పథకాలకు నిధులను అందించగలుగుతుంది.  అధికార పక్షమైన డెమోక్రాట్లకు దిగువ సభలో అధిక్యత లేకపోవడం, విపక్ష రిపబ్లికన్లకు స్వల్ప మెజారిటీ ఉండడంతో 12 ద్రవ్య వినిమయ బిల్లులకు ఆమోదం లభించడం లేదు. వీటిలో ఉక్రెయిన్‌కు నిధులు అందజేసే బిల్లు ఒకటి. ఉక్రెయిన్‌ బిల్లును పూర్తిగా ఉపసంహరించుకోవాలని రిపబ్లికన్లు డిమాండ్‌ చేస్తున్నారు. ఇతర బిల్లుల్లో 30శాతం వ్యయం తగ్గించడానికి డెమోక్రాట్లు సిద్ధమైనా...విపక్ష రిపబ్లికన్లు అందుకూ ఒప్పుకోలేదు. దిగువ సభ స్పీకర్‌ మెకార్థీ విపక్ష రిపబ్లికన్‌ పార్టీకే చెందినప్పటికీ దేశ ప్రజలకు కలిగే ఇబ్బందులు నివారించేందుకు బిల్లులను ఆమోదించాలని సభ్యులను కోరారు. జో బైడెన్‌ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలనే పట్టుదలతో ఉన్న రిపబ్లికన్‌ పార్టీలోని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ మద్దతుదారులు ఎట్టకేలకు ఓ మెట్టు దిగి వచ్చారు. స్పీకర్‌ ప్రతిపాదించిన స్వల్పకాల బిల్లుకు ఆమోదం తెలిపారు. ఈ సభలో మొత్తం 435 మంది సభ్యులకు గాను ప్రస్తుతం 433 మంది ఉన్నారు. వీరిలో 221 మంది రిపబ్లికన్‌ పార్టీకి, 212 మంది డెమోక్రాట్లకు చెందిన వారు. స్వల్ప కాల బిల్లును 335 మంది సమర్థించగా 91 మంది వ్యతిరేకించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023) పద్దుల్లో చూపిన స్థాయిలోనే రానున్న 45 రోజులకు సరిపడే నిధుల మంజూరుకు అమోదం లభించింది. అధ్యక్షుడు బైడెన్‌ కోరిన విధంగా విపత్తు సహాయ నిధికి 16 బిలియన్‌ డాలర్ల మేర అధికంగా నిధులు మంజూరు చేయడానికి సభ్యులు అంగీకరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)