అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ న్యూహ్యాంప్‌షైర్‌లో ఏర్పాటు చేసిన ఆర్థికవ్యవస్థ విధి, విధానాలపై ఏర్పాటు చేసిన ప్రసంగంలో చైనాను ఉద్దేశించి హెచ్చరికలు చేశారు. 'అమెరికాకు చైనాతో ప్రమాదం పొంచి ఉంది. అది యుద్ధానికి సిద్ధమవుతోంది. అమెరికాను ఓడించేందుకు చైనా 50 ఏళ్ల నుంచి పన్నాగాలు పన్నుతోంది. కొన్ని విషయాల్లో చైనా సైన్యం ఇప్పటికే అమెరికా సాయుధ బలగాలతో సమానంగా ఉంది. మన దేశ మనుగడకు, ముఖ్యంగా కమ్యూనిస్టు చైనాను ఎదుర్కోనేందుకు బలం, ఆత్మాభిమానం చాలా అవసరం. చైనా మన వాణిజ్య రహస్యాలను తెలుసుకుంటోంది. వారు మనపై గెలవాలని భావిస్తున్నారు' అని ఆమె అన్నారు. అనంతరం ఆమె ఆర్థిక ప్రణాళికను పంచుకుంటూ 'మధ్య తరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి బలంగా కృషి చేస్తా. మీ డబ్బును మీరే మెరుగ్గా ఉపయోగించుకోగలరు. మీరందరూ మన ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తారని నమ్మకం ఉంది. ఫెడరల్ గ్యాస్, డీజిల్ పన్నును పూర్తిగా తొలగిస్తాం. దాని వల్ల రికార్డు స్థాయి గ్యాస్ ధరలతో పోరాడుతున్న కుటుంబాలకు మేలు కలుగుతుంది. దేశ అధ్యక్షురాలిగా ఎన్నికైతే శ్రామిక కుటుంబాలకు ఆదాయపు పన్ను తగ్గిస్తా. బైడెన్ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీలను కూడా తొలగిస్తా. దీంతో శత్రుదేశానికి మన దేశం నుంచి ఆర్థిక ద్వారాలు మూసుకుపోతాయి. రాజకీయ నాయకులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారులకు కూడా ఐదేళ్లకు మించి ఒకే పదవిలో ఉండకూడదు. కాలపరిమితిని అమలు చేయడం వల్ల వారూ మంచి ప్రజా సేవకులుగా పనిచేస్తారు. అంతేకాకుండా మన ప్రభుత్వాన్ని భ్రష్టుపట్టించే రాజకీయాలకు దూరంగా ఉంటారు' అని అన్నారు.
చైనా యుద్ధానికి సిద్ధమవుతోంది !
September 23, 2023
0
Tags