హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్య లో భారత్ పాత్ర ఉందని ఆరోపిస్తున్న కెనడా ఇందుకు సంబంధించి తమ వద్ద ఉన్న ఆధారాల్ని మిత్రదేశాలైన అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ తో పంచుకుంది. వీటి ఆధారంగా ఇప్పుడు కెనడా మిత్రదేశాలు భారత్ పై ఒత్తిడి పెంచడం మొదలుపెట్టాయి. తాజాగా భారత్ లో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా కెనడా ఇచ్చిన ఆధారాల్ని చూపుతూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో పాటు ఇతర కెనడా మిత్రదేశాధినేతలు ప్రధాని మోడీని చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. అయితే కెనడా వద్ద ఎలాంటి ఆధారాలు లేవని భారత్ ఆరోపిస్తోంది. కెనడా విచారణలో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్ అధినేత హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత్ పాత్ర ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదని, కేవలం స్వదేశంలో సిక్కుల్ని సంతృప్తి పరిచేందుకే కెనడా ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నట్లు విదేశాంగశాఖ ఆరోపిస్తోంది. అయితే కెనడా మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దాంతో పాటే మిత్రదేశాలు కూడా భారత్ పై అంతకంతకూ ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా అమెరికా హోంశాఖ కార్యదర్శి మ్యాథ్యూ మిల్లర్ మరోసారి భారత్ పై ఒత్తిడి పెంచేలా వ్యాఖ్యలు చేశారు. నిజ్జార్ హత్య కేసులో భారత్ కెనడాకు సహకరించాలని ఇప్పటికే ప్రత్యక్షంగా, పరోక్షంగా తాము కోరినట్లు ఆయన వెల్లడించారు. దీంతో భారత్ పై అమెరికా సహా కెనడా మిత్రదేశాలు ఎంత ఒత్తిడి పెడుతున్నాయో అర్ధమవుతోంది. మరోవైపు కెనడా ప్రభుత్వం భారత్ పై దూకుడుగా వ్యవహరిస్తుండటంతో ఆ దేశంలో సిక్కులు మరింత రెచ్చిపోతున్నారు. భారత్ ఎంబసీ వద్ద నిరసనలకు దిగుతున్నాయి.
కెనడా సహకరించమని భారత్ పై ఒత్తిడి పెంచుతున్న అమెరికా !
September 26, 2023
0
Tags