బెంగళూరు అవుటర్ రింగ్ రోడ్డుపై ట్రాఫిక్‌లో చిక్కుకుపోయిన ఓ వ్యక్తి చేసిన పనికి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంతే కాదు ఆ నగరంలో ట్రాఫిక్ అంత భయంకరంగా ఉంటుందా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే... రిషి అనే వ్యక్తి బెంగళూరులో డిజైన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. బుధవారం రాత్రి విధులు ముగించుకొని ఇంటికి కారులో బయలుదేరారు. అయితే, వాహనాల రద్దీ ఎక్కువ కావడంతో రోడ్లపైనే గంటలపాటు ఎదురు చూడాల్సి వచ్చింది. దాంతో రిషి తన స్నేహితులతో కలిసి సరదాగా తాను ఉన్న చోటు నుంచే పిజ్జా ఆర్డర్ చేశారు. ట్రాఫిక్‌లో ఉండగానే తనకు పిజ్జా అందడంతో ఆశ్చర్యపోవడం ఆయన వంతైంది. 'బెంగళూరు నగరం ట్రాఫిక్‌తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో మేము డోమినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ చేయాలని నిర్ణయించుకున్నాం. వారు దయతో మేమున్న ప్రదేశాన్ని (కారు కొన్ని మీటర్లు ముందుకు కదిలింది) ట్రాక్ చేశారు. ట్రాఫిక్ జాంలోనే మాకు పిజ్జా డెలివరీ చేశారని' రిషి తనకు ఎదురైన అనుభవాన్ని వివరిస్తూ ట్విటర్‌లో పోస్టు చేశారు. అందుకు సంబంధించిన వీడియోను జత చేశారు. దాంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. 'ఈసారి నేను కుదిరితే మసాజ్ చేయించుకుంటానని' ఓ నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించాడు. '30 నిమిషాల్లోనే పిజ్జా డెలివరీ చేస్తామనే హామీని డోమినోస్ నిలబెట్టుకుంది. ఇది అద్భుతం. అయితే, డెలివరీ బాయ్ కష్టాన్ని మనం గుర్తించాలి. అంత బీభత్సమైన ట్రాఫిక్‌లో ట్రాక్ చేస్తూ కస్టమర్ దగ్గరకు చేరుకున్నందుకు అతణ్ని అభినందించాల్సిందేనని' మరో నెటిజన్ కామెంట్ చేశాడు.
బెంగళూరు ట్రాఫిక్‌లో చిక్కుకుని పిజ్జా ఆర్డర్ !
September 28, 2023
0
Tags