టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల వయో పరిమితి 61 సంవత్సరాలకు పెరిగే అవకాశం ఉంది. సంస్థలో ప్రస్తుతం రిటైర్‌మెంట్ వయసు 60గా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం బిల్లును శాసనసభ, మండలి ఆమోదించిన విషయం తెలిసిందే. గవర్నర్ ఆమోదంతో చట్టరూపం దాల్చనుంది. అనంతరం వారంతా ప్రభుత్వ ఉద్యోగులవుతారు. ఈక్రమంలో వారి పదవీ విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. దీంతో సంస్థకు ఆర్థికంగా కొంత ప్రయోజనం కలగనుంది. రిటైర్ అయ్యే ఉద్యోగులకు చేయాల్సిన చెల్లింపులకు సంబంధించి మరో ఏడాది సమయం వెసులుబాటు లభిస్తుంది. ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారనుండగా, కార్పొరేషన్ యథాతథంగా కొనసాగుతుంది. ప్రభుత్వంలో ఉద్యోగుల విలీనంతో ఏర్పాటుచేసే శాఖకు ప్రజారవాణా లేదా మరో పేరు పెట్టనున్నారు. సెప్టెంబరులో కొత్త శాఖను ఏర్పాటుచేసి, కమిషనర్‌ను నియమించనుంది. సంస్థకు ప్రస్తుతం వైస్ ఛైర్మన్, ఎండీగా వీసీ సజ్జనార్ ఉన్నారు. అటు కొత్త శాఖకు, ఇటు కార్పొరేషన్‌కు మధ్య సమన్వయం కోసం రెండు బాధ్యతలనూ ఒకరికే అప్పగించాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ప్రస్తుత వైస్ ఛైర్మన్, ఎండీ సజ్జనార్‌కే కమిషనర్ బాధ్యతలూ ఇచ్చే అవకాశం ఉంది. ఆర్టీసీలో మొత్తం 43,055 మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రభుత్వంలో విలీనంతో వేతనాలపై ఆర్టీసీ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. డ్రైవర్లు, కండక్టర్లు వంటి ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయని, అధికారులు, ఉన్నతాధికారులకు పెరగవని చెబుతున్నారు. ఆర్టీసీలో ప్రస్తుతం అధికారులు, ఉన్నతాధికారుల వేతనాలు భారీగా ఉండటమే ఇందుకు కారణం. కార్మికులు సమ్మెలు చేసిన సందర్భాల్లో అలవెన్సులు, ఇతరత్రా రూపంలో అధికారులకు భారీగా వేతనాలు పెరిగాయి. 'ప్రభుత్వంలో విలీనం తర్వాత సాంకేతికంగా మా వేతనాలు తగ్గుతాయి. జీతాలు తగ్గించకుండా.. ప్రస్తుతం వస్తున్న దానిని కొనసాగించి భవిష్యత్తులో పెరిగే మొత్తాన్ని సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. తద్వారా కొన్నేళ్లవరకు ప్రస్తుత వేతనమే ఉంటుందని భావిస్తున్నాం' అని ఓ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఈడీ) తెలిపారు. అదనపు పని గంటలతో ఒత్తిడి, వయసు కారణాలతో కొందరు డ్రైవర్లు పదవీ విరమణ తీసుకుంటున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత 61 ఏళ్ల వరకు పనిచేయడం డ్రైవర్లు, మెకానిక్‌లకు ఇబ్బందేనని ఆ అధికారి పేర్కొన్నారు.
టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల వయోపరిమితి 61 ఏళ్లు ?
August 09, 2023
0
Tags