సూడాన్‌లో ఆకలితో 500 మంది చిన్నారులు మృతి

Telugu Lo Computer
0


సూడాన్‌లో అంతర్యుద్ధం కారణంగా దారుణ పరిస్థితులు నెలకొన్నట్లు అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో ఘర్షణలు ప్రారంభమైన ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకు దాదాపు 500 మంది చిన్నారులు ఆకలితో ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికంగా పనిచేసే సేవ్‌ ది చిల్డ్రన్‌ అనే స్వచ్ఛంద సంస్థ వెల్లడించింది. అంతేకాకుండా 31వేల మంది పోషకాహార లోపంతో బాధపడుతోన్నప్పటికీ వారికి చికిత్స అందడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. 'చిన్నారులు ఈ స్థాయిలో ప్రాణాలు కోల్పోతారని మేం ఎన్నడూ ఊహించలేదు. కానీ, సూడాన్‌లో నెలకొన్న పరిస్థితులు ఇవే. నిర్మూలించగలిగే ఆస్కారం ఉన్న ఆకలితో.. చిన్నారులు చనిపోవడం కలచివేస్తోంది' అని సేవ్‌ ది చిల్డ్రన్‌ సూడాన్‌ డైరెక్టర్‌ ఆరీఫ్‌ నూరీ పేర్కొన్నారు. మరోవైపు ఘర్షణల కారణంగా అనేక మందికి నీరు, విద్యుత్‌ సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడుతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆరోగ్య వ్యవస్థ కూడా పూర్తిగా కుప్పకూలిపోయిందని సమాచారం. సూడాన్‌లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ను సైన్యంలో విలీనం చేసేందుకు రూపొందించిన ప్రతిపాదన.. ఆర్మీ- పారామిలిటరీ బలగాల మధ్య ఘర్షణలకు దారితీసిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 15న మొదలైన ఈ అంతర్యుద్ధంలో దాదాపు 4వేల మంది మృతి చెందినట్లు ఐరాస విభాగాలు పేర్కొన్నాయి. వాస్తవానికి ఈ సంఖ్య మరింత ఎక్కువ ఉంటుందని అంచనా. ఈ పరిస్థితుల కారణంగా దాదాపు 44లక్షల మంది సురక్షిత ప్రాంతాలు లేదా పొరుగు దేశాలకు తరలివెళ్లిపోయినట్లు ఐరాస శరణార్థి విభాగం అంచనా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)