విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలే రౌడీషీటర్ హేమంత్ మరో ఐదుగురితో కలిసి ఎంపీ భార్య, కుమారుడు, ఆడిటర్ ను కిడ్నాప్ చేయడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన జరిగిన తర్వాత ఎంపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. విశాఖపట్నాన్ని వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోవాలని భావిస్తున్నారు. హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలపై ఎక్కువ దృష్టి పెట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు, వ్యాపారాలు ఒకేసారి చేయడం కష్టమైపోతోందని, రాజకీయాల్లో ఉండటంవల్ల ఎవరో ఒకరు ఏదో ఒకటి వ్యాఖ్యానిస్తుంటే బాధ కలుగుతోందని ఎంపీ అన్నారు. విశాఖలో ప్రజాసేవ కోసం రాజకీయాలు చేస్తానని, వ్యాపారం మాత్రం హైదరాబాద్ లో చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. అధికార పార్టీలో ఉండటంవల్ల తనపై అసత్య ప్రచారాలు ఎక్కువగా వస్తున్నాయని, వైజాగ్ అభివృద్ధిలో ఎంవీవీ బిల్డర్స్ ముఖ్యపాత్ర పోషించిందని చెప్పారు. ఇక్కడి ప్రజలకు మంచి ప్లాట్లతోపాటు మంచి సర్వీస్ కూడా అందించామనే తృప్తి ఉందన్నారు. డబ్బుల కోసం కిడ్నాప్ చేశారని, విశాఖ వదిలివెళ్లనని, రాజకీయాలకు ముడిపెట్టి వ్యాపారాలను ఎత్తి చూపుతున్నారన్నారు. ప్రశాంతంగా వ్యాపారం చేసుకునేందుకు హైదరాబాద్ వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పారు. తన కుటుంబ సభ్యులను కిడ్నాపర్లు చిత్రహింసలకు గురిచేశారని, వారిస్థానంలో తానుంటే చచ్చిపోవడం లేదంటే చంపడమో చేసేవాణ్ని అన్నారు. ఈ విషయమై ప్రత్యేకంగా సీఎంను కలిసే ఉద్దేశం లేదన్నారు. కిడ్నాపర్లకు శిక్ష పడేంతవరకు తాను ఏం చేయాలో అంతా చేస్తానన్నారు. గతంలో మధురవాడలోని సాయిప్రియ గార్డెన్స్ వద్ద ఎంపీ ఎవీవీ చేపట్టిన ప్రాజెక్టు విషయంలో కూడా వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఎంపీపై కేంద్ర ఇంటెలిజెన్స్ విభాగానికి చెందిన నాన్ కేడర్ ఎస్పీ ఒకరు ఆరోపణలు చేశారు.
హైదరాబాద్ లో ఉన్న వ్యాపారాలపై ఎక్కువ దృష్టి !
June 20, 2023
0
Tags