నోమోఫోబియా !

Telugu Lo Computer
0


నో( NO ) మొబైల్‌ ( MO ) ఫోన్‌ ( PHO) ఫోబియా (BIA) అనే పరిస్థితి నుంచే నోమోఫోబియా(NOMOPHOBIA) అనేది వచ్చిందంటున్నారు. ఇదొరకమైన మానసిక సమస్యగా చెప్పొచ్చు. ఇటువంటి సమస్య ప్రతి నలుగురిలో ముగ్గురికి ఉంటుందని అధ్యయనంలో బయటపడింది. నోమోఫోబియాను మొట్టమొదటిసారి 2008లో యూకేలో గుర్తించారు. యూకే రీసెర్చ్‌ ఏజెన్సీకి చెందిన యూగవర్నమెంట్‌ 2163 మందిపై నిర్వహించిన సర్వేలో దీని గురించి ప్రస్తావించారు. సర్వేలో 53 శాతం మంది నోమోఫోబియా లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. అప్పటికీ ఇప్పటికీ నోమోఫోబియాతో బాధపడేవాళ్ల సంఖ్య కూడా భారీగా పెరుగుతూనే ఉంది. ప్రతి నలుగురిలో ముగ్గురు సెల్‌ఫోన్‌ లేకుండా ఉండలేకపోతున్నారని ఒప్పో ఇండియా, కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నిర్వహించిన తాజా అధ్యయనంలో కూడా వెల్లడైంది. ఒకప్పుడు మొబైల్‌ను కేవలం మాట్లాడుకోవడానికి (కాల్స్‌) మాత్రమే ఉపయోగించేవారు. కానీ ఇప్పుడు ప్రతి పనిలోనూ స్మార్ట్‌ఫోన్‌ భాగమైపోయింది. ఏ చిన్న పనికి అయినా సరే మొబైల్‌ తప్పనిసరి అన్నట్లుగా మారింది. దీనికితోడు గేమ్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో చాలామంది ఫోన్లకు అతుక్కుపోతున్నారు. దానికి బానిసగా మారిపోతున్నారు. అందుకే ఫోన్‌ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నారు. ఫోన్‌ దూరమైతే తమ శరీరంలో ఒక అవయవాన్ని కోల్పోయినట్లుగా కంగారు పడిపోతున్నారు. నోమోఫొబియా లక్షణాలు ఉన్నాయో లేదో సులువుగానే గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. ఫోన్‌ను కొద్దిసేపు ఆఫ్ చేయడానికి కూడా ఇబ్బంది పడటం.. ఒకవేళ పక్కనబెట్టినా లేదా జేబులో పెట్టుకున్నా సరే మిస్‌డ్‌కాల్స్‌, మెసేజెస్‌ ఏమైనా వచ్చాయా? అని మాటిమాటికి ఫోన్‌ తీసుకుని చూసుకోవడం.. నెట్‌వర్క్‌ లేకపోయినా, ఇంటర్నెట్‌ కనెక్షన్‌ పోయినా కంగారుపడిపోవడం.. బయటకు వెళ్లినప్పుడు ఫోన్‌ ఎక్కడ స్విచ్ఛాఫ్‌ అయిపోతుందో అని ఆందోళన చెందడం.. బ్యాటరీ ఒక్క పాయింట్ తగ్గినా టెన్షన్‌ పడిపోయి ఛార్జింగ్‌ పెట్టడం.. వీటిలో ఏ సమస్య అనిపించినా భావోద్వేగానికి గురికావడం.. కంగారు పడటం ఇవన్నీ కూడా నోమోఫోబియా లక్షణాలుగానే నిపుణులు చెబుతున్నారు. నోమోఫోబియా ఉన్నవారు ఎప్పుడూ విచారంగా ఉండటం, ఎవరినో కోల్పోయినట్లుగా నిస్సహాయ స్థితిలో ఉన్నట్లు అనిపించడం, అభద్రతాభావం ఇతర పనుల మీద ఫోకస్‌ చేయలేకపోవడం ఇవన్నీ కూడా నోమోఫోబియా లక్షణాలే. గంటలకొద్దీ మొబైల్‌ ఫోన్‌ను వినియోగించకుండా స్వీయ నియంత్రణ పెట్టుకోవాలి. రోజు ఆఫీసుకు లేదా కాలేజీకి వెళ్లి ఒక్కరోజు సెలవు ఎలా తీసుకుంటున్నారో.. అలాగే మొబైల్‌ ఫోన్‌కు కూడా ఒకరోజు సెలవు ఇవ్వడం అలవాటు చేసుకోవాలి. వారంలో ఒకరోజు మొబైల్‌ను పక్కనపడేసి ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపేలా ప్లాన్‌ చేసుకోవాలి. ఇతరత్రా కార్యకలాపాలపై దృష్టిసారించాలి. మానసిక ఆందోళనను తగ్గించుకోవడానికి యోగా, వ్యాయామం చేయాలి. వీటి వలన మనసుకు ప్రశాంతత లభిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)