ఆంధ్రప్రదేశ్ లో గత రెండు వారాలుగా రుతుపవనాల కోసం ఎదురుచూస్తున్నా తొలకరి మాత్రం పలకరించడం లేదు. దీంతో జనం వర్షాలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రం మొత్తానికి కాకపోయినా కొన్ని జిల్లాలకు మాత్రం ఈ వార్త ఊరచనిచ్చేలా ఉంది. దీంతో ఎండ వేడిమి నుంచి కనీసం ఆయా జిల్లాలకు ఊరటదక్కనుంది. ఈనెల 18 నుంచి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వాతావరణ శాఖ అందించిన వివరాల మేరకు జూన్ 16వ తేదీన ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని , 17 వ తేదీ మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుందని వెల్లడించింది. అయితే మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో అక్కడక్కడ మాత్రం వర్షాలు నమోదవుతాయని తెలిపింది. జూన్ 18వ తేదీ మధ్యాహ్నం వరకు ఎండ తీవ్రత ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది. అక్కడి నుంచి ఆయా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంచనా వేస్తోంది. మధ్యాహ్నం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుందని, 18 వ తేదీ సాయంకాలం, రాత్రి సమయం నుంచి వర్షాలు మొదలవుతాయని వెల్లడించింది. గుంటూరు, కృష్ణాతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తాయని అంచనా. ఈ నెల 18న ప్రారంభమయ్యే వర్షాలు పలుచోట్ల మోస్తరు గానూ, మరికొన్ని చోట్ల భారీగానూ ఉండొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ వర్షాలు ఉరుములు, పిడుగులతో ఉండొచ్చని కూడా అంచనా. 18 రాత్రి నుంచి 19, 20, 21 వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశమున్నట్లు తెలిపింది. జూన్ 22వ తేదీ మాత్రం అక్కడక్కడ మాత్రమే వర్షాలు నమోదవుతాయని తెలిపింది.
18 నుంచి ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వర్షాలు !
June 16, 2023
0
Tags